దోమకొండ: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రి ఎదుట వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 40 రోజుల కింద రిటైర్మెంట్ అయిన టీవీ వీపీ కమిషనర్ స్థానంలో ఎవరినీ భర్తీ చేయని కారణంగా పరిపాలనలో శూన్యత ఏర్పడి చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఈ పదవి బాధ్యతను ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం.. ఆయన సమయాన్ని కేటాయించకపోవడం వల్ల అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నాయని, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల ఎదుట వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేస్తున్నామని తెలిపారు. సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


