ఎన్నికలకు భారీ బందోబస్తు
● 722 మందితో ఐదంచెల భద్రత
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించి ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 722 మంది పోలీసులు ఎన్నికల భద్రత విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ముగ్గురు డీఎస్పీల పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 10 మంది సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, 21 రూట్ మొబైల్ పార్టీలతో పాటు మరో ఐదుగురు ఎస్‌హెచ్‌వోలతో పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా బృందాలు నిరంతరం భద్రతా చర్యల్లో పాల్గొంటాయన్నారు. జిల్లాలో గుర్తించిన 17 క్రిటికల్, 8 సెన్సిటివ్, 8 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్‌ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకురాకూడదని సూచించారు. పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడం నిషిద్ధమన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


