దొంగ నోట్ల పంచాయితీ
బ్యాంకు లోన్ తీర్చేందుకు వెళ్లగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వర్ని మండలం జలాల్‌పూర్‌లో జాలీ నోట్లు వెలుగు చూడడంతో ఎక్కడివారక్కడ అప్రమత్తమయ్యారు. జలాల్‌పూర్ నుంచి వచ్చారా? అయితే నగదు వద్దు.. డిజిటల్ పేమెంట్లు మాత్రమే చేయండి.. వర్ని, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో వ్యాపారులు ప్రత్యేకంగా ఇలా చెబుతుండడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తారనే భయంతో తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను గ్రామస్తులు కాల్చివేస్తుండడం విశేషం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జలాల్‌పూర్ గ్రామంలో ఓటర్లకు దొంగనోట్లు పంపిణీ చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. సర్పంచ్ అభ్యర్థి తమకు నకిలీ కరెన్సీ ఇచ్చి మోసం చేశాడని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
జలాల్‌పూర్‌కు చెందిన కల్యాణ్, గోపాల్, శంకర్, రవి అనే నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ఈ దొంగనోట్లు తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతం నుంచి జడ్చర్లకు నకిలీ నోట్లు రాగా, రూ.1 లక్షకు రూ.3 లక్షల చొప్పున రూ.500 నకిలీ నోట్లను తెచ్చారు. గత మూడు నెలల కాలంలో రెండుసార్లు ఇలా దొంగనోట్లను తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే నోట్ల చలామణి ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. పెట్రోల్ బంక్‌లో చలామణి చేసేందుకు ప్రయత్నం చేయగా బెడిసికొట్టింది. బంక్‌లో తీసుకోకపోవడంతో మరో మార్గం ఆలోచించారు. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నోట్లను ఖర్చు పెట్టినట్లు తెలిసింది.
నకిలీ నోట్ల వ్యవహారం బ్యాంకు అధికారుల ద్వారా వెలుగులోకి వచ్చింది. వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ చెల్లించేందుకు వచ్చిన వ్యక్తి దొంగనోట్లు తీసుకురావడంతో వాటిని గుర్తించి పట్టుకున్నారు. జలాల్‌పూర్‌కు చెందిన నరెడ్ల చిన్న సాయిలు తన క్రాప్ లోన్ కట్టేందుకు రూ.2.09 లక్షలు (రూ.500 నోట్లు) తీసుకొచ్చాడు. అవన్నీ నకిలీ నోట్లు కావడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను తీసుకెళ్లినవి నకిలీ నోట్లు అనే విషయం చిన్నసాయిలుకు తెలియకపోవడం గమనార్హం. బంధువు అయిన సర్పంచ్ భర్త బాలు నకిలీ నోట్లను సాయిలు ఇంట్లో దాచిపెట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఇంట్లో లభించిన నోట్లను సాయిలు బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఇంతకుముందు జలాల్‌పూర్ సర్పంచ్ అభ్యర్థి మమత భర్త బాలు, తన సోదరుడు శంకర్‌తో కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఈ కరెన్సీని పంపిణీ చేసినట్లు తెలియడంతో పోలీసులు ఈ బృందాన్ని అరెస్టు చేశారు. బాలు కాంగ్రెస్, శంకర్ బీజేపీ పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో ఈ కేసును తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నకిలీ కరెన్సీ బృందంలో ఉన్న గోపాల్ అనే వ్యక్తి ఈ వ్యవహారంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ బైక్‌ను సైతం ఉపయోగించినట్లు పలువురు చెబుతున్నారు. మరోవైపు వర్ని మండలంలోని జాకోరా, జలాల్‌పూర్, బడాపహాడ్ గ్రామాల్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ చలామణి అయినట్లు తెలియడంతో గత నెలలో ‘సాక్షి’లో దొంగ నోట్ల కలకలం పేరిట వార్త ప్రచురితమైంది.
ఎన్నికల సమయంలో వర్ని మండలం
జలాల్‌పూర్‌లో పంపిణీ
మహారాష్ట్ర నుంచి
జడ్చర్ల మీదుగా జిల్లాలోకి..
రూ.లక్షకు రూ.3 లక్షలు
తీసుకొచ్చిన ఘనులు


