ఫోన్ పోతే ఆందోళన చెందొద్దు
● సీఈఐఆర్ విధానంలో
రికవరీకి అవకాశం
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: సెల్‌ఫోన్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ విధానంలో రికవరీకి అవకాశం ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరంగా సెల్‌ఫోన్‌ల రికవరీకి చర్యలు చేపడుతున్నామన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నెలకు 150కి పైగా సెల్‌ఫోన్‌లను రికవరీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 15 రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 112 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామని తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.18 లక్షలు ఉంటుందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.3 కోట్ల విలువైన 1,894 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామని తెలిపారు. రికవరీ చేసిన ఫోన్‌ల వివరాలను బాధితులకు తెలియజేస్తామని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు(87126 86114)ను సంప్రదించి ఫోన్‌లు తీసుకువెళ్లాలని సూచించారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేసి కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలని సూచించారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


