పనిచేయని సర్వర్.. జారీ కాని సర్టిఫికెట్లు
ఆగిపోయిన పనులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో రెండు నెలలుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో సంబంధిత వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రోజూ మీసేవ కేంద్రాలు, బల్దియా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సర్వర్ డౌన్ అన్న సమాధానమే వస్తోంది. ఏకంగా సర్వర్ పనిచేయడం లేదని నోటీస్ అతికించారు.
పెండింగ్‌లో 1500లకుపైగా దరఖాస్తులు..
మున్సిపల్ పరిధిలో పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, మరణించిన వారికి డెత్ సర్టిఫికెట్ల కోసం వందలాది మంది మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
అయితే రెండు నెలలుగా వెబ్‌సైట్ మొరాయిస్తుండడంతో సుమారు 1500లకు పైగా జనన, మరణ దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది.
సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ సర్టి ఫికెట్‌లతో కావాల్సిన పలు పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ రికార్డుల్లో పేరు నమోదుకు, బీమా క్లెయిమ్‌లు, ఇన్సూరెన్స్ డబ్బులు, ఆస్తి బదిలీలు, బ్యాంక్ ఖాతా క్లోజింగ్ తదితర పనులకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. రెండు నెలలుగా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందన్నారు. సమస్య పరిష్కారం కాగానే సర్టిఫికెట్స్ జారీ చేస్తామన్నారు.
రెండు నెలలుగా సమస్య
నిలిచిన జనన, మరణ
ధ్రువీకరణ పత్రాల జారీ
మీ సేవ, బల్దియా కార్యాలయాల
చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు


