ప్రకృతి రైతులు.. ఆధునిక వైద్యులు
సుభాష్‌నగర్: ప్రకృతి రైతులు లాభాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలు పండిస్తున్నారని.. వారు ఆధునిక వైద్యులని రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సేంద్రియ రైతు చిన్నికృష్ణుడు అధ్యక్షతన నగరంలోని ఎన్‌డీసీసీబీ వైఎస్‌ఆర్ భవనంలో ప్రకృతి రైతుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తున్న 9 మంది ఉత్తమ రైతులను ప్రశంసాపత్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. అనంతరం గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. వ్యవసాయ కమిషన్ రైతుల కోసమే పని చేస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పశు సంపదను పెంపొందించాలని సూచించారు. విచ్చలవిడిగా యూరియా, రసాయనిక ఎరువుల వినియోగంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల భూమి పంటల సాగుకు పని రాకుండా భూసారం కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, డీఏవో వీరా స్వామి, ఆత్మా పీడీ తిరుమల ప్రసాద్, ఎన్‌డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, డీజీఎం లింబాద్రి, ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ జనార్దన్, సుమారు వందమంది ప్రకృతి రైతులు పాల్గొన్నారు.
మితిమీరిన యూరియాను
వినియోగించొద్దు
రైతు సంక్షేమ వ్యవసాయ కమిషన్
సభ్యులు గడుగు గంగాధర్
ఆరోగ్యకరమైన పంటలు పండించాలి
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
సుంకెట అన్వేష్‌రెడ్డి
ప్రకృతి రైతులు.. ఆధునిక వైద్యులు


