అటవీశాఖ తీరును నిరసిస్తూ ధర్నా
పిట్లం(జుక్కల్): పిట్లం – బాన్సువాడ రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో నర్సరీ వద్ద రోడ్డు పనులను అటవీశాఖ అధికారులు నిలిపివేయడంతో సోమవారం గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పనులు నిలిపి వేసిన స్థలానికి చేరుకొని ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజల కోసం రోడ్డు వెడల్పు పనులను చేపడితే, అధికారులు పనులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. దీంతో అటవీశాఖ అధికారులు ఈ రోడ్డు విస్తరణ చేయడానికి వీలులేదని, ఈస్థలం అటవీ శాఖ పరిధిలో ఉందని అందుకే ఆపివేశామని చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. సింగిల్ రోడ్డుకు ఎందుకు అనుమతిని ఇచ్చారని, ఇప్పుడు రోడ్డు విస్తరణ చేస్తే ఏం నష్టం జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులు తీరును నిరసిస్తూ రోడ్డుకు అడ్డుగా వాహనాలను పెట్టి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ తీరును నిరసిస్తూ ధర్నా


