రెండూళ్ల ‘పంచాయతీ’
● ఒకే పంచాయతీ కార్యాలయంలో
ప్రమాణ స్వీకారానికి ఇరు గ్రామాల పట్టు
● ఇరు వర్గాల మధ్య వాగ్వాదం..
● ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా
మాచారెడ్డి : సోమారంపేట, సోమారంపేట తండా పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ భవన వివాదంతో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సోమారంపేట గ్రామంలో నూతన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో సోమారంపేట గ్రామం నుంచి విడిపోయిన సోమారంపేట తండా పంచాయతీ పాలక వర్గం తాము కూడా సోమారంపేట పంచాయతీ భవనంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని పట్టుబట్టారు. దీనికి సోమారంపేటవాసులు ఒప్పుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమారంపేట పంచాయతీ కార్యాలయంతో పాటు పలు ఇళ్లు సోమారంపేట తండా గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చాయని, పంచాయతీ కార్యాలయంలో తమకు హక్కు ఉంటుందని సోమారంపేట తండా పాలకవర్గం, తండా వాసులు భీష్మించుకుని కూర్చున్నారు. ఎంపీడీవో గోపిబాబు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, పోలీస్ కంట్రోల్ రూం ఎస్సై నరేశ్, కామారెడ్డి పట్టణ, రామారెడ్డి ఎస్సైలు శ్రీరాం, రాజశేఖర్ అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో, పోలీసులు కలిసి సోమారంపేట, సోమారంపేట తండా పంచాయతీల పాలక వర్గాలకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్పడంతో సోమారంపేట తండా పాలక వర్గం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంది. సోమారంపేట పాలక వర్గం రాకపోవడంతో, వారు వస్తేనే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని తండా పాలకవర్గం అక్కడి నుంచి వెనుదిరిగింది. దీంతో రెండు పంచాయతీల పాలకవర్గాల ప్రమాణా స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీవో ప్రకటించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.


