ఓటరు మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను జనవరి 13 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించి బూత్‌ల వారీగా సమీక్షించారు. తహసీల్దార్‌లతో మాట్లాడి మండలాల వారీగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతిని తెలుసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటరు జాబితాలో స్పష్టంగా లేని ఫొటోలను గుర్తించాలన్నారు. ఫారం– 8 ద్వారా అసలైన ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, అధికారులు పాల్గొన్నారు.


