
దివ్యాంగులను మోసం చేస్తున్న సీఎం
బాన్సువాడ: ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. బీర్కూర్‌లో శనివారం నిర్వహించిన మహాగర్జన సన్నాహాక సభకు ఆయన హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి దివ్యాంగుల పింఛన్ రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని హా మీ ఇచ్చి గద్దె ఎక్కగానే దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న వారిని నిలదీయాల్సిన ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని దుయ్యాబట్టారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే మహా గర్జనకు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంథని సామిల్, దివ్యాంగుల హక్కుల సమితి జిల్లా నాయకులు కుమ్మరి సాయిలు ఉన్నారు.
పెన్షన్లను పెంచాలి..
ఎల్లారెడ్డిరూరల్: ఆసరా, వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎల్లారెడ్డిలో శనివారం నిర్వహించిన పెన్షన్‌దారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆదిమూలం సతీష్, ప్రవీణ్ తదితరులున్నారు.