
మూడొందల మందికి ఒకే టాయిలెట్
క్యూలో నిలబడుతున్నాం
బాధలు వినేవారు లేరు
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటుకు ధీటుగా అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. హైస్కూల్‌లో 250 మంది విద్యార్థులు, ప్రైమరీలో 50 మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి ఉంది. హైస్కూల్ టాయిలెట్స్ పూర్తిగా శిధిలావస్థలో ఉన్నాయి.. వాడడం లేదు. ప్రైమరీ పాఠశాలకు ఉన్న ఒకే మరుగుదొడ్డిని రెండు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు వాడుతున్నారు. తరగతులు వదిలి టాయిలెట్ వద్ద క్యూలో నిలబడాల్సిన దుస్ధితి ఏర్పడింది. కొందరు విద్యార్థులు టాయిలెట్స్ కోసం ఇంటికి వెళ్తున్నారు. ఇన్ని ఇ బ్బందులున్నా అధికారులు ఇటు వైపు కన్నెతి చూడకపోవడం గమనర్హం. నిర్మించడానికి రేపు మాపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు.
వచ్చిన నిధులు వెనక్కి..
ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద మరుగు దొడ్ల నిర్మాణం కోసం 2023లో అలాగే 2025లో హైస్కూల్‌కు రూ.12 లక్షలు, ప్రైమరీ పాఠశాలకు రూ.4 లక్షల నిధులు రెండు సార్లు మంజూరయ్యాయి. అధికారుల అలసత్వంతో ఏళ్లు గడుస్తున్నా మరుగుదొడ్లు నిర్మించలేదు. బిచ్కుంద జీపీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు ఆగిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలో ఈజీఎస్ పనులు చేయకపోవడంతో మరుగు దొడ్లకు మంజూరైన రూ.లక్షల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. జీపీగా ఉన్నప్పుడు మంజూరైన పనులు చేయకుండా అధికారుల నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా టాయిలెట్లు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. తూతూమంత్రంగా ఒక టాయిలెట్‌కు మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక నిధులు మంజూరు చేసి కనీసం నాలుగు మరుగుదొడ్లు కట్టించాలని విద్యార్థులు కోరుతున్నారు.
టాయిలెట్ వద్ద క్యూలో నిల్చున్న విద్యార్థినులు
టాయిలెట్స్ కోసం చదువులు వదిలి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్దితి ఏర్పడింది. చాలా అసహ్యంగా ఉంది. ఆపుకుంటే కడుపు ఉబ్బి నొప్పి వస్తుంది. కలెక్టర్ సారు స్పందించి కట్టించాలని కోరుతున్నాం.
–దీపాలి, 7వ తరగతి విద్యార్థిని, బిచ్కుంద
పాఠశాలలో మరుగుదొడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మా బాధలు ఎవరికీ కనబడటం లేదు. వందల మంది విద్యార్థులకు ఒకటే మరుగుదొడ్డి ఉంది. కనీసం నాలుగైదు కట్టించాలని కోరుతున్నాం.
– సంధ్య, 7వ తరగతి విద్యార్థిని, బిచ్కుంద
బిచ్కుంద బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌లో మరుగుదొడ్లు లేక అవస్థలు
గతంలో నిధులు మంజూరైనా
నిర్మించకపోవడంతో
వెనక్కిపోయిన నిధులు
మున్సిపాలిటీ పరిధిలో
నిలిచిన ఈజీఎస్ నిధులు

మూడొందల మందికి ఒకే టాయిలెట్

మూడొందల మందికి ఒకే టాయిలెట్