
నేడు పనుల జాతర
కామారెడ్డి క్రైం: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనుల జాతర కార్యక్రమాన్ని నేడు (శుక్రవారం) ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఆయా గ్రామసభల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీలు, ఏపీవోలు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనేలా చూడాలన్నారు. గ్రామ సభల్లో గతేడాది చేపట్టిన జీపీ, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఉద్యానవనాలు, సోక్ పిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, సిగ్రిగేషన్ షెడ్‌లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్లు తదితర పనుల వివరాలతోపాటు ఆయా పనులు చేపట్టడం ద్వారా గ్రామంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో అత్యధిక రోజులు పని చేసిన కూలీలను, దివ్యాంగ కూలీలను, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించాలని డీఆర్డీవో సురేందర్‌ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర అన్ని ప్రభుత్వ ఆస్తుల భవనాలపై సోలార్ విద్యుత్ సిస్టంను ఏర్పాటు చేయడానికి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే వివరాలతో కూడిన జాబితాను వెంటనే ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ రమణను ఆదేశించారు. జిల్లాలోని అడ్వాన్ ్డ్స టెక్నాలజీ కేంద్రాల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏటీసీ కేంద్రాల్లో అధునాతన కోర్సులను అభ్యసిస్తే వచ్చే ఉద్యోగ అవకాశాలను యువతకు వివరించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో 11,818 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వాటిలో 5,909 గృహాలకు మార్కింగ్ ఇచ్చి ప్రారంభించామన్నారు. 2660 గృహాలు బేస్‌మెంట్ స్ధాయి వరకు, 283 ఇళ్లు గదుల, 107 స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. 100 శాతం పూర్తయిన ఇళ్ల నిర్మాణాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. తప్పుగా నమోదైన లబ్ధిదారుల ఆధార్ కార్డుల సవరణ త్వరగా పూర్తి చేయించాలన్నారు. ఇళ్లను త్వరితగతిన నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యను వీలైనంత త్వరగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, హౌసింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులను ఆహ్వానించి
ఘనంగా నిర్వహించాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో
వేగం పెంచాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్