
ఆనందం కావొద్దు విషాదం!
గుండెను పిండేసే డీజేలు..
సమాచారం ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వినాయక చవితి వస్తుందంటే అందరిలోనూ ఆనందం. నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెడతారు. అందరికన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న విగ్రహం కొనాలని ఎక్కడెక్కడికో వెళ్లి తీసుకొస్తారు. మండపాలను అందంగా తీర్చిదిద్దడానికీ పోటీ పడతారు. తొమ్మిది రోజుల పాటు పూజలు, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరకు నిమజ్జన కార్యక్రమంలో నృత్యాలు చేస్తూ పూర్తిచేస్తారు. అయితే ఆనందంలో చేసే నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాలకు ముందుగానే విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళుతుండగా ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్మూర్ నుంచి సిరిసిల్లాకు కామారెడ్డి మీదుగా మంగళవారం ఉదయం ఎత్తైన విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి ఓ యువకుడు తన పుట్టిన రోజునే ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేసింది. గతంలోనూ అనేక అనుభవాలున్నాయి. అయినా విగ్రహాలను తరలించే సమయంలో, శోభాయాత్ర ఊరేగింపులోనూ జాగ్రత్తలు తీసుకోక ప్రాణాలు పోతున్న ఘటనలు ప్రతి ఏడాది జరుగుతున్నాయి.
చెరువుల్లో నిమజ్జనం చేసేటపుడు..
భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో అవి ఎంతకూ మునగడం లేదని లోతుల్లోకి తీసుకెళ్తుంటారు. ఒక్కోసారి విగ్రహం అదుపు తప్పి వారిపై పడుతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. జిల్లాలో ప్రతి ఏడాది ఒకరిద్దరు నిమజ్జనం చేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత వచ్చినా ఒక్కోసారి పైన విగ్రహం పడితే దాని కింద కూరుకుపోయి చనిపోతారు.
వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజేలు వాడడం, భారీ సౌండ్‌తో గుండె తట్టుకోలేక ప్రాణాలు పోయే పరిస్థితులున్నాయి. రెండేళ్ల నాడు రామారెడ్డి మండలం రెడ్డిపేటలో డీజే సౌండ్‌తో ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబానికి తీరని వేదన మిగిలింది. తమతో కలిసి ఉన్న స్నేహితుడి ప్రాణాలు పోవడంతో మిత్రులంతా ఆవేదనకు గురయ్యారు. వారికి జీవితాంతం ఒక బాధైతే మిగిలింది. జిల్లా కేంద్రంలో డీజేలకు అనుమతులు ఇవ్వడం లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో డీజేలు వాడుతున్నారు. డీజే సౌండ్‌తో అన్ని వయసుల వారికి ప్రమాదమన్న విషయాన్ని గుర్తించాలి.
వినాయక ఉత్సవాల్లో
జాగ్రత్తలు అవసరం
చిన్న చిన్న పొరపాట్లే ప్రాణాలు తీస్తాయి
శోభాయాత్ర, నిమజ్జన సమయంలో మరింత జాగ్రత్త అవసరం
వినాయక విగ్రహాలను తరలించే సమయంలో సమాచారమిస్తే మా సిబ్బంది సహకరిస్తారు. వైర్లను స్వయంగా తొలగించే ప్రయత్నం చేస్తే ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. ఆరేపల్లి వద్ద జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించాం. ఎత్తైన విగ్రహాన్ని తీసుకువెళ్లేటపుడు సమాచారం ఇవ్వాలి. వినాయక మండపాల వద్ద విద్యుత్తు కనెక్షన్ల కోసం, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. మా దృష్టికి తీసుకురాకుండా వైర్లను తొలగించొద్దు.
– శ్రావణ్‌కుమార్, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద విద్యుత్ సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే విగ్రహాలను ప్రతిష్ఠించడానికి తరలించే సమయంలో, నిమజ్జనం వేళ శోభాయాత్రలో వెళ్తున్నపుడు కరెంటు వైర్లు తగిలి ఇనుప రాడ్లతో వాహనాలపై కూర్చున్నవారు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల వినాయక విగ్రహాలు మరీ ఎత్తుగా ఉండి, తరలించేటపుడు చూసుకోక ఇబ్బందులు పడుతున్నారు.