
విత్తనక్షేత్రంలో వానాకాలం సాగులేనట్లేనా..?
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఈ యేడు వానాకాలం పంటలసాగుపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ యేడు విత్తనక్షేత్రంలో వానాకాలం పంటల సాగు లేనట్లేనా అంటే ప్రస్తుతం క్షేత్రంలో నెలకొన్న పరిస్థితులు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. సగం సీజన్ పూర్తయినా ఇప్పటివరకు క్షేత్రభూముల్లో పంటలసాగుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభమవ్వలేదు. వందల ఎకరాల సాగుభూమిని కలిగి ఉన్న మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వానాకాలం పంటల సాగు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. క్షేత్రభూముల్లో పంటలసాగు కోసం ప్రతియేడులాగే ఈ యేడు కూడ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికీ రెండుమార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ నేటికీ ఉన్నతాధికారుల నుంచి పంటలసాగు కోసం ఎలాంటి అనుమతులు రాలేదని క్షేత్ర అధికారులు తెలిపారు. ఈ యేడు వానాకాలంలో విత్తనక్షేత్రంలో 50 ఎకరాల్లో వరి, మరో 80 ఎకరాల్లో జీలుగ పంటలను సాగు చేయాలని క్షేత్రఅధికారులు కమిషనర్ కార్యాలయానికి రెండు మార్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. కాని పంటలసాగుపై వారి నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని క్షేత్రఅధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా విత్తనక్షేత్ర భూముల్లో వానాకాలం పంటలసాగుకు సంబంధించి నేటికీ ఎలాంటి పనులు ప్రారంభంకాలేదు. వరిసాగు కోసం కనీసం నారుమడిని సిద్ధం చేయలేదు.
ప్రతియేడు ఇదే తీరు..
వందల ఎకరాల సాగుభూమిని కలిగి ఒకప్పుడు మేలు రకాల నూతన వరి వంగడాల ఉత్పత్తితో తెలంగాణ వ్యాప్తంగా పేరుగాంచిన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రంలో అధికారుల తీరుతో నిర్లక్ష్యపునీడలు అలుముకున్నాయి. సాధారణంగా రైతులు వానాకాలం పంటలసాగులో భాగంగా చాలారోజులక్రితమే వరినాట్లు పూర్తిచేశారు. ఇతర రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన విత్తనోత్పత్తిక్షేత్రంలో నేటికీ వానాకలం పంటలసాగు పనులు ప్రారంభంకాలేదు. పంటలసాగుకు ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఈ యేడు క్షేత్రభూములు పంటలసాగుకు నోచుకోక బీడుగానే మిగలనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పంటలసాగు కోసం
ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు
పంపిన క్షేత్రఅధికారులు
ఉన్నతాధికారుల నుంచి
నేటికీ రాని అనుమతులు
బీడుగా మిగిలిన విత్తన క్షేత్ర భూములు