
ఆశ కార్యకర్త ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడిలో ఓ ఆశ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలు ఇలా.. పద్మాజీవాడికి చెందిన మ్యాదరి అంబిక(40) గతకొన్ని రోజులుగా ఆశ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కొన్నేళ్ల క్రితమే భర్త మరణించాడు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించింది. దీంతో అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఒంటరిగా జీవిస్తుండటంతో జీవితంపై విరక్తి చెందింది. ఈక్రమంలో సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురై, డబ్బులు పోగొట్టుకోగా పోలీసులు రికవరీ చేశారు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. కోటగిరి గ్రామానికి చెందిన ఎజాస్ అహ్మద్ ఖురేషి అనే వ్యక్తి వాట్సప్‌కు 13 ఏప్రిల్ 2025 నాడు అనుమానాస్పద లింక్ మెసేజ్ రాగా ఓపెన్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంక్ అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు దోచేశారు. వెంటనే బాధితుడు కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, వారు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి బాధితుడికి రూ.5వేలు రిఫండ్ చేయించారు.
నిజామాబాద్ లీగల్/కామారెడ్డి క్రైం: ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలాలా.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన గుడిలింగం పండరి అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. సులువుగా డబ్బు సంపాదన కోసం దొంగతనాలకు అలవాడు పడ్డాడు. ఈక్రమంలో గ్రామంలోని గోనె కాశవ్వ (58) అనే వృద్ధురాలి ఆభరణాలను దొంగిలించాలనుకున్నాడు. 29 సెప్టెంబర్, 2024న కాశవ్వ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె తలపై రోకలి దుడ్డుతో కొట్టి హత్యచేసి, ఆమె మెడలో ఉన్న గుండ్లు, చెవులకు ఉన్న నగలను దొంగిలించాడు. మృతురాలి కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. నిందితుడు లింగంను అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ (ఎస్సీ, ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడికి హత్యా నేరానికి గాను జీవిత ఖైదు, దొంగతనం నేరానికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఎస్సీ మహిళను చంపినందుకు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
బైక్ చోరీ కేసులో ఇద్దరికి 9 నెలల జైలు
ఎల్లారెడ్డి: బైక్ చోరీ కేసులో ఇద్దరికి 9నెలల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించారు. వివరాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన బత్తుల హరిక్రిష్ణ ఎల్లారెడ్డి పట్టణంలో ఉంటూ మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. 2024 డిసెంబర్ 11న అతడి బైక్ ఇంటి ముందు నుంచి చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులుగా ఎర్ర అశోక్, దొడ్ల గోపాల్‌గా గుర్తించారు. కోర్టు లో విచారణ జరుగగా ఎల్లారెడి కోర్టు జడ్జి సుష్మ నిందితులకు 9 నెలలు జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో సుంకెట విజయకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు తహసీల్దార్ రవీందర్‌రావు మంగళవారం తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, టీవీ, ఫ్రిజ్, సెల్‌ఫోన్లు, బియ్యం, నగదు, బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.