
ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది చేరిక
తెయూ(డిచ్‌పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో 3వ విడత కౌన్సెలింగ్‌లో 81 మందిని కేటాయించగా, బుధవారం సాయంత్రం వరకు 61 మంది విద్యా ర్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)లో 48 మంది, సీఎస్ ఐటీలో ముగ్గురు, సీఎస్ (ఏఐ) లో ఏడుగురు, డాటా సైన్స్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు.
హాస్టల్ వసతి లేక వెనుకంజ
ఇంజినీరింగ్ విద్యార్థులకు తెయూ క్యాంపస్‌లో హాస్టల్ వసతి కల్పించడం లేదు. దీంతో కౌన్సెలింగ్‌లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకున్నారు. హాస్టల్ వసతి లేకపోవడంతో కొందరు బాలికలు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేశారు. నాలుగు కోర్సులకు 264 సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కళాశాల మంజూరులో ఆలస్యం కావడం, హాస్టల్ వసతి లేకపోవడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సీట్ల భర్తీకి ఇక స్పాట్ కౌన్సెలింగ్‌పైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది.