
బకాయిల ‘పంచాయితీ’
బిచ్కుంద(జుక్కల్) : బిచ్కుంద జీపీ నుంచి నూతన మున్సిపాలిటీగా ఏర్పడింది. నాలుగు నెలల క్రితం మున్సిపల్ అధికారులు జీపీ రికార్డులు స్వాధీనం చేసుకొని బాధ్యత తీసుకున్నారు. ఈక్రమంలో జీపీ బకాయిలు మున్సిపల్ కు సంబంధంలేదని అధికారులు చేతులెత్తెస్తున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పడక ముందు ఏడాదిన్నరలో బోరు మోటర్ల మరమ్మతులు, ట్రాక్టర్ చెత్త సేకరణ డీజిల్, పారిశుధ్య పనులు, క్లోరినేషన్ కోసం బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్లు జీపీకి వ్యాపారులు సరఫరా చేశారు. ఈ బకాయిలు సుమారు రూ. 16 లక్షలు ఉన్నాయి. బోరు మెకానిక్‌లు, బ్లీచింగ్ పౌడర్, బల్బులు ఇచ్చిన వ్యాపారులు డబ్బుల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జీపీ పాత బకాయిలు చెల్లించడానికి మున్సిపల్ శాఖకు అనుమతులు ఉండవని, చిల్లిగవ్వ చెల్లించమని మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఎంబీ రికార్డులు ఉండవు మీ బకాయి డబ్బులు రావని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. సొంత డబ్బులు పెట్టి బోర్లు మరమ్మతులు చేశామని రూ. రెండు లక్షలు బకాయిలు ఉన్నాయని ఓ మెకానిక్ వాపోయాడు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ స్పందించి బోరు మెకానిక్, బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్లు, పైపు లైన్ల మరమ్మతుల పాత బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
బోరు మరమ్మతులకు ముందుకు రాని మెకానిక్‌లు..
పాత బకాయిలు ఇవ్వకపోవడంతో బోరు మోటార్లు మరమ్మతులు, వీధిలైట్లు, పైపులైన్ మరమ్మతులు చేయడానికి మెకానిక్‌లు ముందుకు రావడం లేదు. చెడిపోయిన సింగిల్ ఫేజ్ మోటార్లు మరమ్మతులు చేయిస్తామని మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. 13,14,15,16 వార్డులలో మూడు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు మోటారు బిగించలేదు. కొన్ని చోట్ల చెడిపోయిన మోటర్‌లను బోరులో నుంచి కనీసం తీయకుండా వదిలేశారు. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మున్సిపల్‌లో విలీనమై జీపీ గ్రామాలు గోపన్‌పల్లి, కందర్‌పల్లి, దౌల్తాపూర్ బిచ్కుంద నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామ ప్రజలు సమస్యలు తెలపడానికి బిచ్కుంద మున్సిపల్ కార్యాలయానికి రావాలి. మున్సిపల్ 12 వార్డులకు ముగ్గురు జూనియర్ అసిస్టెంట్‌లను వార్డు ఆఫీసర్లుగా నియమించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. మోటర్లు, వీధిలైట్లు బిగించి డ్రెయినేజీలు శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్లు జీపీకి
సరఫరా చేసిన వ్యాపారులు
రూ.16 లక్షల బకాయిలు
మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన బిచ్కుంద పంచాయతీ
పాత బకాయిలతో సంబంధం
లేదంటున్న మున్సిపల్ అధికారులు
ఆందోళనలో వ్యాపారులు
మరమ్మతులు చేయిస్తాం..
జీపీ పాత బకాయిలు మున్సిపల్ కార్యాలయానికి సంబంధం లేదు. జీపీ పాత బకాయిలు చెల్లించాలని మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. బకాయిల కోసం వచ్చిన వ్యాపారులకు చెల్లించమని చెప్పాం. వార్డు ఆఫీసర్లుగా ముగ్గురు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. ఒక్కొక్కటిగా మోటరు మరమ్మతులు చేసి బిగిస్తున్నాం.
– ఖయ్యూం, కమిషనర్, మున్సిపల్ బిచ్కుంద