సర్కారు బడిలో పిల్లలు
ఆదర్శంగా నిలిచిన ప్రధానోపాధ్యాయుడు
బీబీపేట: తన పిల్లలను సర్కారు బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు మాందాపూర్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ చింతల ప్రభాకర్. ప్రభాకర్‌కు ఇద్దరు పిల్లలు. సోమవారం ఆయన వారిని తీసుకుని పాఠశాలకు వచ్చారు. కూతురు మృణాళినిని మూడో తరగతిలో, కుమారుడు శివకేశవ్‌ను ఒకటో తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. డిజిటల్ తరగతులు అందుబాటులో ఉన్నాయని, నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను సర్కారు బడిలో చేర్పించానన్నారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ ప్రత్యూష్, ఉపాధ్యాయులు శ్యాం, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.


