విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
సిరికొండ: మండలంలోని కొండూర్‌లో విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై ఎల్ రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన వేల్పూర్ నవీన్(29) అనే యువకుడు వడ్రంగి పని చేయానికి తన మామ అయిన రవి వద్దకు కొండూర్ గ్రామానికి వచ్చాడు. బుధవారం గ్రామ సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. కిందికి వేళాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరి చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందని గ్రామస్తులు వాపోయారు. వారి నిర్లక్ష్యాన్ని నిరసిస్తు గ్రామస్తులు రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి వచ్చిన ఏఈ చంద్రశేఖర్, ట్రాన్స్‌కో సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై ఎల్ రామ్ గ్రామస్తులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లారీ ఢీకొని ఒకరు..
ఖలీల్‌వాడి: నగరంలోని దుబ్బ ప్రాంతంలో లారీ ఢీకొని ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బకు చెందిన సుంకరి నర్సయ్య(68) బుధవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


