ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
కామారెడ్డి టౌన్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు రాష్ట్ర కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎడాదిన్నరలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని బీఆర్‌ఎస్, బీజేపీలు చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన బీఆర్‌ఎస్‌కు, తెలంగాణకు నయా పైసా ఇవ్వని బీజేపీ కి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్త, నాయకుల రుణం తీర్చుకుంటామన్నారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీల ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలలో గెలవడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, ఆగ్రో పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జీలు సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, నాయకులు పండ్లరాజు, రాజిరెడ్డి, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కులగణన దేశానికి ఆదర్శం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డిలో జిల్లా కాంగ్రెస్
విస్తృతస్థాయి సమావేశం


