మరో పిడుగు!
భిక్కనూరుపై
● రసాయన ఆధారిత
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అడుగులు
● కోవిడ్ సమయంలోనే
అనుమతులు
● ఈనెల 7న
ప్రజాభిప్రాయ సేకరణ
● స్థానికులకు
సమాచారం కరువు
● కాలుష్యంతో ముప్పు
తప్పదంటున్న
నిపుణులు
ఇప్పటికే కెమికల్, ఫార్మా కంపెనీల కారణంగా కాలుష్యం కోరల్లో చిక్కుకున్న భిక్కనూరు మండలంపై మరో పిడుగు పడబోతోంది. మరో రసాయన ఆధారిత ఫార్మా ఉత్పత్తి కంపెనీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈనెల 7న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా.. ఈ విషయం ఇప్పటివరకు స్థానికులకు తెలియకపోవడం గమనార్హం.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
రాష్ట్ర రాజధానికి తొంభై కిలోమీటర్ల దూరంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న భిక్కనూరు మండలంలో ఇప్పటికే పలు కెమికల్, ఫార్మా కంపెనీలతో పాటు వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ మరో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కోవిడ్ సమయంలో అంటే 2021లోనే అనుమతులు తీసుకున్నారు. అయితే ఆ కంపెనీని మరో భారీ ఫార్మా కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేసి, దాన్ని భారీ స్థాయిలో విస్తరించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కోరింది. దీంతో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు ఈనెల 7న ముహూర్తం నిర్ణయించింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ గురించి స్థానికులకు తెలియకపోవడం విచిత్రం.
ఆందోళన వ్యక్తం చేస్తున్న సంస్థలు..
రసాయన ఆధారిత ఫార్మా ఉత్పత్తి(బల్క్ డ్రగ్) కంపెనీ అని, దీని మూలంగా కాలుష్యం పెచ్చరిల్లి భిక్కనూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రమాదంలో చిక్కుకోవాల్సి వస్తుందని సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కలపాల బాబురావ్, కన్నెగంటి రవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడి రసాయనాల నుంచి ఫార్మా ఉత్పత్తి తయారీ ప్రమాదకర రసాయన ప్రతిచర్యలు, విషవాయువులు, వ్యర్థాలు వెదజల్లుతుందని పేర్కొంటున్నారు. కోవిడ్ సమయంలో అనుమతులు పొందిన సంస్థ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని, ఉత్పత్తి ప్రారంభించనేలేదని, అప్పుడు పొందిన అనుమతులను ఆసరా చేసుకుని విస్తరణ పేరుతో కొనుగోలు చేసిన సంస్థ బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటుకు పూనుకుంటోందని ఆరోపిస్తున్నారు. బీ 2 కేటగిరీలో అనుమతి పొంది, ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలకంటే ఎక్కువగా పెంచుతూ బీ1 కేటగిరీలో విస్తరణ కోరుతున్నారని పేర్కొంటున్నారు.


