సనాతన ధర్మాన్ని కాపాడండి
‘గురువందనం’లో స్వామీజీ సద్గురు సమర్థ మహరాజ్
బాన్సువాడ రూరల్: సనాతన ధర్మాన్ని కాపాడాలని దుబ్బాకకు చెందిన స్వామీజీ సద్గురు సమర్థ మహరాజ్ పిలుపునిచ్చారు. బోర్లం గ్రామంలో ఆదివారం రాత్రి గురువందనం కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు సమర్థ మహరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు గ్రామంలోని దత్తాత్రేయ మందిరం వద్ద భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కోలాటాలు ఆడుతూ, జైశ్రీరాం నినాదాలు చేస్తూ స్వామీజీని సభావేదిక వరకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు. అధర్మంపై నిర్భయంగా పోరాడాలన్నారు. ప్రతి ఒక్కరు స్తీలను గౌరవించాలని సూచించారు. ధర్మ రక్షణకు ముందుకు రావాలన్నారు.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు పర్వారెడ్డి దంపతులు స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. వేలాదిగా హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, విద్యాసాగర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మన్నె రమేష్, రాజేశ్వర్‌గౌడ్, జలీల్, గోపన్‌పల్లి సాయిలు, మమ్మాయి కాశీరాం, మొగులయ్య, గంగారం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


