హడలెత్తిస్తున్న చోరులు
బాన్సువాడ : పట్టణంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దోపిడీకి పాల్పడుతున్నారు.దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.పట్టణానికి చెందిన చెనంగారి సాయవ్వ ఈ నెల 19న ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోవడంతో ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, సుమారు 60 తులాల వెండి చోరీకి గురయ్యాయి. మనువరాలి పెళ్లికి ఉపయోగపడుతుందని 12 తులాల బంగారం జమ చేస్తే దొంగలు దోచుకెళ్లారని ఆమె వాపోయింది. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇంట్లో అంత బంగారం ఎందుకు పెట్టుకున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. చోరీలు జరిగిన సమయంలో హల్‌చల్ చేసే పోలీసులు చోరీకి గురైన సొత్తును రికవరి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి గురువారం జరిగే వారంతపు సంతలో నిఘా పెట్టాల్సి ఉంది. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు..
● ఈ నెల 18న పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘం వద్ద ఓ పెళ్లికి వచ్చిన బంధువుది పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీకి గురైంది.
● అదే రోజు రామ మందిర్ సమీపంలోని ఓ మిల్క్ సెంటర్ నిర్వహకుడు ఎర్రవాటి సాయిబాబా కౌంటర్‌పై నుంచి సెల్‌ఫోన్ చోరీకి గురైంది.
● మార్చి 12 క్రితం పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన దుబాస్ రాములు కుటుంబం తన బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఉన్న రూ. 6500 నగదుతో పాటు 5 తులాల వెండి చోరీకి గురైంది. తలుపులు పూర్తిగా ధ్వంసం చేశారు.
● అదే రోజు అదే కాలనీలో మరో వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తికి చెందిన పర్సును దొంగిలించారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
వాహనాలు సైతం..
భయాందోళనలో బాన్సువాడ ప్రజలు
పెద్ద చోరీలు ఐతేనే స్పందిస్తున్నారు
బాన్సువాడలో దొంగతనాలు నివారించడంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఓ చోట చోరీ జరిగిందంటే చుట్టు పక్కల గ్రామాలు, మండల కేంద్రాల్లో విసృతంగా తనిఖీలు చేసేవారు. పెద్ద పెద్ద చోరీలు ఐతేనే స్పందిస్తున్నారు. బైకులు, చిన్న చిన్న దొంగతనం చేస్తే పట్టించుకోవడం లేదు.
– దుబాస్ రాములు
సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం
ఇటీవల జరిగిన చోరీలు స్థానికంగా ఉండే వారే చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. పట్టణంలో గస్తీ పెంచుతాం. చోరీల నివారణకు చర్యలు తీసుకుంటాం.
– అశోక్, సీఐ బాన్సువాడ
హడలెత్తిస్తున్న చోరులు


