రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మన్నే ప్రభాకర్ సూచించారు. మంగళవారం లింగంపేట మండలంలోని మెంగారం, ఎల్లారం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెంగారంలో ఆయన మాట్లాడారు. భూభారతి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు. రెవెన్యూ, అటవీ శాఖ భూముల వివాదాలను ఇరు శాఖల అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలోని మెంగారం గ్రామంలో 321, 322 సర్వే నంబర్లలో 60 మంది రైతులకు చెందిన 185 ఎకరాలు పట్టాలు ఉన్నా ఆన్‌లైన్‌లో సర్కారు భూమిగా చూపిస్తున్నట్లు అధికారుల దృష్టికి తెచ్చినట్లు రైతులు తెలిపారు. అలాగే రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో మరికొన్ని భూములు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఆర్‌ఐ కిరణ్, ఎఫ్‌ఆర్‌వో ఓంకార్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


