ప్రాణం తీసిన కారు పంచాయితీ!
దోమకొండ: ఒక కారు ఇన్‌స్టాల్‌మెంట్‌ల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న పంచాయితీ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రమేశ్(35) కొంత కాలం క్రితం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇటుకబట్టి నిర్వాహకుడు పల్లె పోశయ్యకు తన కారును విక్రయించాడు. కారుకు సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్‌ల చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది.
అయితే పల్లె పోశయ్య ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ ఇచ్చిన కంపెనీ ప్రతినిధులు రమేశ్‌కు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని అడుగుతున్నారు. దీంతో బుధవారం సాయంత్రం ఈ విషయమై రమేశ్, పోశయ్యల మధ్య వాగ్వాదం జరిగింది. తన కారు తాను తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్న రమేశ్.. గురువారం తెల్లవారుజామున చింతమాన్‌పల్లి శివారులోని ఇటుకబట్టి వద్దకు వెళ్లి రెండో కీతో కారును స్టార్ట్ చేశాడు. దీనిని గమనించిన పల్లె పోశయ్య, ఇటుక బట్టి కూలీలు రమేశ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కారు ముందుకు కదలడంతో పోశయ్య కాలుకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన కూలీలు రమేశ్‌పై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న రమేశ్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చారు.
రమేశ్‌ను ఆటోలో కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, దోమకొండ ఎస్సై స్రవంతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మృతుడు రమేశ్ గ్రామంలో గోపాలమిత్రగా పనిచేసేవాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.


