రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా. కల్లూర్ గ్రామానికి చెందిన బీర్కూర్ గంగారాం కుటుంబ సభ్యులు రేకుల ఇంట్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం వారు ఇంట్లో పూజాకార్యక్రమాలు ముగించుకుని ఇంటికి తాళం వేసి, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి గంగారాంకు సమాచారం అందించారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇల్లు నిర్మించుకునేందుకు అప్పుగా తెచ్చుకున్న నగదుతోపాటు, బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, వంట సామగ్రి, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రూ.మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. పూజ కోసం వెలిగించిన దీపం కింద పడిపోవడంతో మంటలు అంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.