డొంకేశ్వర్(ఆర్మూర్): లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన నిర్విన్ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఆపన్నహస్తాలు ముందుకొస్తున్నాయి. తొండాకూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం బాలుడి వైద్య ఖర్చుల కోసం రూ.30వేల చెక్కును సోమవారం అందజేశారు. గంగాసముందర్ గ్రామానికి చెందిన యువత సైతం ముందుకొచ్చి తోచిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిర్విన్ తేజ్ చదువుతున్న తొండాకూర్ ఎస్‌ఎస్‌వీ పాఠశాల యాజమాన్యం ౖసైతం విరాళాలు సేకరిస్తోంది. నిర్విన్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ‘పాపం బాలుడిని ఆదుకోరూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ నగర శివా రులోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సైదా జైనబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, పీహెచ్‌డీ, నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 27 వరకు గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఇది పూర్తి తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకమని, 28న డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యతోపాటు క్రీడలకు ప్రోత్సాహం
తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి అన్నారు. తెయూలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ యాన్యువల్ డే–2025 స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా బాలుర కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యతోపాటు క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెయూ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఆర్‌వో పున్నయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఆర్ నేత తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ తొలి పోరులో ఎంఎస్సీ కెమిస్ట్రీ జట్టు–అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు తలపడగా అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు విజయం సాధించింది. రెండవ పోరులో అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు, మాస్ కమ్యూనికేషన్ జట్టు తలపడగా మాస్ కమ్యూనికేషన్ జట్టు విజయం సాధించింది.
31లోపు పరీక్ష ఫీజు చెల్లించండి
నిజామాబాద్‌అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2వ, 4వ, 6వ డిగ్రీ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలకు, 1 నుంచి 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈనెల 31లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ రామ్మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100తో అపరాధ రుసుంతో ఏప్రిల్ 4లోపు, రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 6లోపు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 7వరకు ఫీజు చెల్లించవచ్చునన్నారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలన్నారు.
ముందుకొస్తున్న ఆపన్నహస్తాలు