
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూంలో విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. సోమవారం ఆయ న కంట్రోల్ రూంను సందర్శించి, సిబ్బందితో సమావేశమయ్యారు. 1950 టోల్‌ఫ్రీ నంబరు, సి–విజిల్ యాప్‌ల ద్వారా వస్తున్న ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ప్రచార వాహనాలను తిప్పడం, సభలు, సమావేశాలు, ర్యాలీ నిర్వహించడం, లౌడ్ స్పీకర్లు, డబ్బు, మద్యం, కానుకల పంపిణీ, ప్రకటనలులాంటివి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనను, ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ నిశితంగా గమనిస్తోందన్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీ బృందాలు గట్టి నిఘా ఉంచాలన్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి పోలింగ్ ముగిసేవరకు ఉండే సమయం కీలకమన్నారు. ఆ సమయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యం సామాజిక మాధ్యమాలలో వచ్చే అసత్యపు వార్తలపై నిఘా ఉంచాలన్నారు. అలాంటివి వైరల్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, నోడల్ అధికారులు కిషన్, సింహారావు, సురేందర్ కుమార్, సతీష్ యాదవ్, ఎన్నికల అధికా రి సాయిభుజంగరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్