మార్పులు.. చేర్పులు | - | Sakshi
Sakshi News home page

మార్పులు.. చేర్పులు

Nov 29 2026 12:08 AM | Updated on Nov 29 2026 12:08 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ, శాసనసభ స్థానాలు 50 శాతం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసింది. డీలిమిటేషన్‌ బిల్లులో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో పునర్విభజన బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సరికొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు, ఔత్సాహికులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. నియోజకవర్గాలు పెరిగితే తమకు రాజకీయంగా ఛాన్స్‌ దక్కుతుందనే ఆశతో ఉన్న నేతలకు వచ్చేవన్నీ మంచి రోజులుగానే అనుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే అదనపు నియోజకవర్గాలతో వచ్చే 2029లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించసున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో ఉత్సాహంతో ఉన్నారు. విభజన తరువాత ఏర్పాటైన నాలుగు (తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పోలవరం) కొత్త జిల్లాల్లో పెరిగే అసెంబ్లీ స్థానాలు, వాటిలో 33 శాతం రిజర్వేషన్లలో మహిళలకు లభించే స్థానాలపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా...

పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పడింది. ఇదిలా ఉండగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడు నియోజకవర్గాలతో ఒక జిల్లాను వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న 22 స్థానాల ప్రాతినిధ్యం కాస్తా పునర్విభజన అనంతరం 31 నుంచి 33 స్థానాలకు పెరిగే అవకాశాలున్నాయి. మూడు లోక్‌సభ స్థానాలు ఉండగా.. నాలుగు లేదా ఐదుకు పెరిగే ఛాన్స్‌ ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన కసరత్తు చేపట్టనున్నారు. ఈ క్రమంలో జనాభా లెక్కలు కీలకం కానున్నాయి.

కాకినాడ జిల్లాలో కొత్తగా..

జనాభా ప్రాతిపదికన కొత్తగా ఏర్పాటు కానున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు లోక్‌సభ నియోజకవర్గాలే ప్రామాణికం కానున్నాయి. రంపచోడవరం, తుని, రామచంద్రపురంలలో ఏదో ఒక కేంద్రంగా కొత్తగా లోక్‌సభ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్న భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వీటికి అనుగుణంగా కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు కానున్నాయి. ఇంతవరకు రెండు నియోజకవర్గాలుగా ఉన్న కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ పునర్విభజనతో మూడు లేదా నాలుగు నియోజకవర్గాలు కానున్నాయి. తునిలోని తొండంగి మండలం నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి వరకు ఉన్న కోన, తీర ప్రాంతాన్ని కలుపుతూ కొత్తగా ఒక నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే యోచన ఉందంటున్నారు. ఇలా కాకినాడ జిల్లాలో మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.

ఏజెన్సీలోనూ అదే విధంగా..

ఉమ్మడి తూర్పులో అతి పెద్ద నియోజకవర్గమైన రంపచోడవరం మూడు నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన మూడు నియోజకవర్గాలుగా పునర్విభజించడం ఖాయమంటున్నారు. 3.49 లక్షల జనాభా, 2.55 లక్షల ఓటర్లు, రెండు ఐటీడీఏలు, రెవెన్యూ డివిజన్లు (రంపచోడవరం, చింతూరు), 12 మండలాలు, 189 గ్రామ పంచాయతీలు, 827 గ్రామాలతో ఉన్న అతి పెద్ద నియోజకవర్గాన్ని పునర్విభజనతో రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ను రెండు, చింతూరు కేంద్రంగా ఒకటి కలిపి మొత్తంగా మూడు నియోజకవర్గాలు రానున్నాయంటున్నారు. ఇలా మొత్తంగా ఉమ్మడి తూర్పులో 11 నియోజకవర్గాలు అదనంగా వస్తాయనే అంచనాలున్నాయి. దీంతో ఇప్పుడున్న 22కు 11 కలిపితే మొత్తం 33కు నియోజకవర్గాల సంఖ్య చేరనుంది.

గతంలో ఇలా..

2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ఉమ్మడి తూర్పులో 21 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు ఉండేవి. నాడు సంపర నియోజకవర్గం కనుమరుగై కాకినాడ రూరల్‌ నియోజకవర్గం. కడియం నియోజకవర్గం స్థానంలో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం, బూరుగుపూడి నియోజకవర్గం రాజానగరంగా మారాయి. అప్పట్లో ఉన్న ఆలమూరు నియోజకవర్గం అంతర్ధానమైంది. అనంతరం జరిగిన మార్పులు, చేర్పుల్లో మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. మన్యం ప్రాంతంలో ఉన్న ఎల్లవరం నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గంగా మారింది. అప్పటి వరకు ఉన్న 21 నియోజకవర్గాల స్థానంలో 2009 ఎన్నికల నాటికి ఉమ్మడి తూర్పుగోదావరిలో 19 అసెంబ్లీ స్థానాలు మిగిలాయి. అనంతరం జిల్లాల పునర్విభజనలో 21 నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు

ఉమ్మడి ‘తూర్పు’లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు

33కు చేరనున్న శాసనసభా నియోజకవర్గాలు

నాలుగు లేకుంటే, ఐదు కానున్న

లోక్‌సభ స్థానాలు

ఆశల పల్లకిలో రాజకీయ ఔత్సాహికులు

జగన్‌ హయాంలోనే జిల్లాల పునర్విభజన

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంట్‌ స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రంపచోడవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా మార్చారు.

కోనసీమలో మరో మూడింటికి..

మరోవైపు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో పెరిగిన పల్లె వలసల ప్రామాణికంగా మరో నియోజకవర్గం ఏర్పాటు కానుందంటున్నారు. దీంతో పాటు అమలాపురం రూరల్‌, అమలాపురం పట్టణం, అల్లవరం, ఉప్పలగుప్తం, మండలాలతో పాటు ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో కొన్ని గ్రామాలు, అయినవిల్లి (పూర్వం అమలాపురంలో ఉండేది) పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలంలో కొన్ని గ్రామాలు, కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలోని కొన్ని గ్రామాలతో కలిపి కొత్తగా మూడు నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

తూర్పులో మూడు..

తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాలను కలిపి మూడు లేదా నాలుగు నియోజకవర్గాలుగా పునర్విభజిస్తారనే అంచనాలున్నాయి. జిల్లా కేంద్రంలో అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలతో కలిపి మరో రెండు కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం ఉంది.

2004 వరకు ఉమ్మడి తూర్పులో నియోజకవర్గాలు : 21

తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ, సంపర, తాళ్లరేవు, అల్లవరం, ముమ్మిడివరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేట, ఆలమూరు, రామచంద్రపురం, పెద్దాపురం, అనపర్తి, కడియం, రాజమహేంద్రవరం, బూరుగుపూడి, ఎల్లవరం.

2009 ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు: 19

తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, అనపర్తి, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం, రంపచోడవరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement