అఖిలప్రియ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

అఖిలప్రియ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి

Nov 29 2026 12:08 AM | Updated on Nov 29 2026 12:08 AM

● మృతురాలు నాగలక్ష్మి

కుటుంబానికి న్యాయం చేయాలి

● వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి

కాకినాడ రూరల్‌: నంద్యాల జిల్లా అహోబిలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త నాగలక్ష్మి మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. అహోబిలంలో ఎన్నికల రిగ్గింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని అన్నారు. మహిళలపై కర్రలతో దాడి చేయడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. నిరసన తెలుపుతున్న మహిళలపైకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లడంతో నాగలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నాగలక్ష్మి చివరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ మృతి చెందినప్పటికీ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై పోలీసుల తీరును నాగమణి తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. నాగలక్ష్మి కుటుంబానికి తగిన న్యాయం, పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హింసకు బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ అండతో రాష్ట్రంలో పచ్చ గూండాలు రెచ్చిపోతున్నారని, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

తాత్కాలికంగా విధుల

నుంచి తొలగింపు

ప్రత్తిపాడు: గజ్జనపూడి ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మొల్లి శివాజీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఆ గ్రామంలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని గజ్జనపూడి గ్రామానికి చెందిన బర్ల శ్రీను అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు పార్టీకి ఓటు వేస్తే ఉపాధి హామీ పథకం కూలీలకు నకిలీ మస్తర్లు వేస్తానని ప్రలోభ పెడుతున్నట్టు గతంలోనే మండల అధికారుల విచారణలో తేలింది. దీనిపై ఈ నెల 21న షోకాజ్‌ నోటీసు ఇచ్చినప్పటికీ తిరిగి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆయనను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఉత్తర్వులు ఇచ్చినట్టు ఎంపీడీఓ కుమార్‌ బాబు తెలిపారు.

వ్రత పురోహితులపై వేటు?

అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో రెండు, మూడో తరగతి వ్రత పురోహితులుగా సేవలందిస్తున్న మొక్కరాల రవికిరణ్‌ (రాజేష్‌), దేవులపల్లి ప్రకాష్‌లు అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వ వార్డు సభ్యులుగా పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి ఎన్నికల గుర్తులను కూడా కేటాయించారు. అయితే దేవస్థానంలో వ్రత పురోహతులుగా సేవలందిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడంపై వీరి రాజకీయ ప్రత్యర్థులు దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానంలో తమకున్న పరిచయాలతో వీరు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో మొక్కరాల రవికిరణ్‌ కూటమి మద్దతుతో పోటీ చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న ఫొటోలు కూడా ఉన్నతాధికారులకు ప్రత్యర్థులు పంపించారు. దీంతో ఉన్నతాధికారులు ఆ పురోహితులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించేందుకు గాను వ్రతాల విభాగం అధికారులు ఈఓకు ఫైల్‌ పంపించారు. ఈ మేరకు ఈఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

లైసెన్స్‌ ఫీజులు చెల్లించాలి

కాకినాడ రూరల్‌: జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీల యాజమాన్యాలు సవరించిన లైసెన్స్‌ ఫీజులను వచ్చే నెల 31వ తేదీ లోగా విధిగా చెల్లించాలని జిల్లా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కె.రాంబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓఎస్‌హెచ్‌ అండ్‌ డబ్ల్యూసీ కోడ్‌–2020, సంబంధిత ఓఎస్‌హెచ్‌ అండ్‌ డబ్ల్యూసీ (ఏపీ) రూల్స్‌–2026ను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీల లైసెన్స్‌ రుసుములను సవరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య, స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ప్రాతిపదికన ఈ సవరించిన ఫీజులు వర్తిస్తాయని తెలిపారు. నిర్దేశిత గడువులోపు లైసెన్స్‌ ఫీజు చెల్లించని పక్షంలో, చెల్లించాల్సిన రుసుముపై నెలకు 2 శాతం చొప్పున ఆలస్య రుసుము వసూలు చేస్తామని హెచ్చరించారు. ఫీజు చెల్లింపులను ఆంధ్రప్రదేశ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే చేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement