● స్మరించుకున్న
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
● చారిత్రక న్యాయస్థాన భవనాల సందర్శన
● పుష్కర ఘాట్‌లో గోదావరికి దీపారాధన
సావనీర్ విడుదల చేస్తున్న న్యాయమూర్తులు, సీఎం చంద్రబాబు
పుష్కరఘాట్‌లో దీపాలు వదులుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): శతాబ్దాల న్యాయ వారసత్వానికి జిల్లా కోర్టు ప్రతీకగా నిలిచిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. రాజమహేంద్రవరంలోని చారిత్రక న్యాయస్థాన భవనాలను, న్యాయవాదుల సంఘ భవన సముదాయాలను శనివారం వారు సందర్శించారు. అనంతరం నూతనంగా నిర్మించిన టెన్ కోర్ట్స్ భవన సముదాయాన్ని పరిశీలించారు. మొదటగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 222 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జిల్లా కోర్టును సందర్శించారు. తరతరాలుగా న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలకు వేదికగా నిలిచిన ఈ చారిత్రక న్యాయస్థాన ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. అనంతరం 131 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమండ్రి బార్ అసోసియేషన్ భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. 1895లో 14 మంది న్యాయవాదులతో ప్రారంభమైన ఈ సంఘం నేటి వరకు న్యాయవాదుల ఐక్యతకు, న్యాయవాద వృత్తి అభివృద్ధికి, న్యాయవ్యవస్థకు అందిస్తోందన్నారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పుష్కర్ ఘాట్‌కు చేరుకున్నారు. గోదావరికి దీపారాధన చేసి, దీపాలను వెలిగించి పవిత్ర నదిలో వదిలారు.
సావనీర్ విడుదల
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 222 ఏళ్ల జిల్లా న్యాయస్థానం, 131 ఏళ్ల రాజమండ్రి బార్ అసోసియేషన్ చారిత్రక ప్రస్థానం, న్యాయరంగ ప్రముఖుల సేవలు, న్యాయ వారసత్వ విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సావనీర్‌లో న్యాయస్థాన చరిత్ర, బార్ అసోసియేషన్ ప్రస్థానం, న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదుల సేవలకు సంబంధించిన విశేషాలను పొందుపరిచారు. హైకోర్టు న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జునైద్ అహ్మద్ మౌలానా, విశ్రాతం న్యాయమూర్తులు గోడా రఘురామ్, కేసీ భాను, ఎస్.రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్‌వీ ప్రసాద్, న్యాయవాదులు పి.సూర్యనారాయణమూర్తి, ఎన్‌వీ గోపాలకృష్ణమూర్తి, ఎస్‌జీ రామారావు, ఎం.శివసుబ్బారావు పాల్గొన్నారు.


