● ఆయన సూచించిన వ్యక్తికి
కేవలం ఆరుగురే మద్దతు
● పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్
ఎన్నిక వేళ బయటపడిన విభేదాలు
● రసాభాసగా వైస్ చైర్మన్ ఎన్నిక
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఇటీవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తాజాగా జరిగిన మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం వేళ ఈ విషయం బయటపడింది. వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై జనసేన కౌన్సిలర్ల మధ్య విభేదాలు నెలకొనడంతో కౌన్సిల్ హాలులో తీవ్ర గందరగోళం నెలకొంది. వివరాలివీ..
‘బొజ్జ’కు మద్దతు కరువు
పిఠాపురం పురపాలక సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరిగాయి. జనసేన నుంచే ఎన్నికై న నూతన మున్సిపల్ చైర్మన్ దానం లాజర్‌బాబుతో ప్రిసైడింగ్ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ తొలుత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 36 మంది కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తరువాత వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు వివరించారు. కూటమి తరఫున మూడో వార్డు జనసేన కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వరరావు (దొరబాబు) పేరును వైస్ చైర్మన్‌గా 32వ వార్డు టీడీపీ కౌన్సిలర్ శివాల పాపారావు ప్రతిపాదించారు. దీనిని 29వ వార్డు జనసేన కౌన్సిలర్ మగాపు వీవీఎన్ సత్యనారాయణ బలపరిచారు. అయితే ఈ ప్రతిపాదనకు మెజారిటీ కౌన్సిలర్ల నుంచి మద్దతు లభించలేదు. కేవలం ఆరుగురు మాత్రమే చేతులెత్తి మద్దతు తెలిపారు.
ఎంపీ జోక్యం చేసుకున్నా..
ఈ పరిస్థితుల్లో జనసేనకే చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. పార్టీ విప్ జారీ చేసినందున కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. అనూహ్యంగా 14వ వార్డు జనసేన కౌన్సిలర్ పిండి సంధ్య పేరును వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా 12వ వార్డు జనసేన కౌన్సిలర్ ఆగంటి ప్రభాకరరావు ప్రతిపాదించగా, 28వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం రామారావు బలపరిచారు. దీంతో, ఎన్నిక ప్రక్రియ ఒక్కసారిగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో బొజ్జ వెంకటేశ్వరరావు, రెడ్డెం రామారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచీ పని చేస్తున్న వారిని పక్కన పెట్టి, అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరికాదని రెడ్డెం రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని, ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి పదవులు కట్టబెట్టడం అన్యాయమని అన్నారు. దీంతో, ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
కౌన్సిల్ హాలా! చేపల మార్కెట్టా!!
తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఇది కౌన్సిల్ హాలా! చేపల మార్కెట్టా!! అంటూ 12వ వార్డు జనసేన కౌన్సిలర్ ఆగంటి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే కౌన్సిల్ హాలు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ అనుచరులతో నిండిపోయింది. సంబంధం లేని వ్యక్తులు కౌన్సిల్ హాలులోకి ప్రవేశించడంతో అధికారుల తీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సీఐ సత్యనారాయణ, ఎస్సై మణికుమార్ సమావేశ హాలులోకి చేరుకుని, కౌన్సిలర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వివాదం కొనసాగడంతో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సమావేశ హాలు నుంచి బయటకు వచ్చి చర్చలు జరిపారు. అనంతరం పిండి సంధ్య అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఆగంటి ప్రభాకరరావు, బలపరిచిన రెడ్డెం రామారావులతో మాట్లాడి, వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చర్చలు కొలిక్కి రావడంతో ఆగంటి ప్రభాకరరావు కౌన్సిల్ సమావేశ హాలులోకి వచ్చి పిండి సంధ్య పేరుతో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. దీంతో, పోటీలో ఒక్క అభ్యర్థి మాత్రమే మిగలడంతో ప్రిసైడింగ్ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ బొజ్జ వెంకటేశ్వరరావు (దొరబాబు) వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) పీడీ ఎన్‌వీ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎస్‌టీవీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అనుచరుడిని తరిమి కొట్టిన జనసేన కార్యకర్తలు
పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడిన వారికి స్థానం లేదని, పవన్ కల్యాణ్ ఓటమి కోసం పని చేసి, ఇటీవల పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నిరసన తెలిపారు. 30 మంది మద్దతున్న తనకు కాదని, కేవలం ఆరుగురు మద్దతు తెలిపిన వ్యక్తికి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారని, ఇదేం రాజకీయమని వైస్ చైర్మన్ అభ్యర్థి పిండి సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గాలు పార్టీని పూర్తిగా నాశనం చేశాయని విమర్శించారు. నిరసన జరుగుతున్న సమయంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఎంపీ, ఆయన అనుచరులు బయటకు వచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీ అనుచరుడు వీరంరెడ్డి చక్రధర్ అలియాస్ చక్రిని అక్కడి నుంచి తరిమి కొట్టారు. అతడు పోలీసుల సాయంతో అక్కడి నుంచి కారులో జారుకున్నాడు. ఈ ఘర్షణ నేపథ్యంలో జనసేన నాయకుడు రాయవరం శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, వీర మహిళలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. తమ నాయకుడిని విడిచిపెట్టాలంటూ నినాదాలు చేశారు. శ్రీనును పోలీసులు సాయంత్రం వరకూ స్టేషన్‌లో ఉంచి అనంతరం విడిచిపెట్టారు.
ఎంపీపీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థి ఓటమి
ఇటీవల జరిగిన పిఠాపురం ఎంపీపీ ఎన్నికల్లోనూ జనసేన నుంచి బీఫారం పొందిన విరవాడ ఎంపీటీసీ సభ్యురాలు రామిశెట్టి గంగాపార్వతి ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ సూచించిన వ్యక్తికి కేవలం నలుగురే మద్దతు తెలపడంతో జనసేనకు భంగపాటు తప్పలేదు. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవడంతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం సాక్షిగా జనసేన పరువు బజారున పడింది. దీంతో, రంగంలోకి దిగిన పెద్దలు మరో వ్యక్తిని తెర పైకి తీసుకురావాల్సి వచ్చింది. కొత్తపల్లి ఎంపీపీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థికి చుక్కెదురైంది.


