అంబాజీపేట: ఓటర్లకు ఎన్నికల సేవలను మరింత చేరువ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ’ఈసీఐనెట్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.
గతంలో ఎన్నికల సేవల కోసం అనేక యాప్‌లు, పోర్టర్లను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పెడుతూ, 40కి పైగా ఎన్నికల సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చారు.
ప్రధాన సేవలు
కొత్త ఓటు – సవరణలు: కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునేవారు ఫారం–6, అలాగే వివరాల్లో మార్పులు లేదా చిరునామా మార్పు కోసం ఫారం–8 ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటరు జాబితా: ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవడంతో పాటు, డిజిటల్ ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు స్థితి: మనం చేసుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు.
అధికారులతో అనుసంధానం: తమ ప్రాంత బూత్‌స్థాయి అధికారి, ఇతర ఎన్నికల అధికారుల వివరాలు తెలుసుకోవడం, అవసరమైతే బీఎల్డీఓతో కాల్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ఫిర్యాదులు అభ్యర్థుల వివరాలు: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడంతో పాటు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఉపయోగపడుతుంది.


