● వైద్యం వికటించి, తల్లి, పురిటి బిడ్డ మృతి
● వలసపాకల ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
● కుటుంబ సభ్యుల ఆందోళన
● ముగ్గురు వైద్యులపై కేసు
● డీఎంహెచ్‌ఓ విచారణ
● యాజమాన్యానికి షోకాజ్ నోటీసు
కాకినాడ రూరల్: పండంటి బిడ్డకు జన్మనించేందుకు ఎన్నో ఆశలతో ఆ నిండు గర్భిణి పురిటి కోసం ఆస్పత్రికి వెళ్లింది. కానీ, వైద్యుల నిర్లక్ష్యం ఆమెతో పాటు ఆమె నవజాత శిశువు ప్రాణాలను కూడా బలి తీసుకుంది. ఈ విషాద సంఘటన కాకినాడ రూరల్ వలసపాకలలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సర్పవరం పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ అర్బన్ రమణయ్యపేటకు చెందిన వాసిరెడ్డి ఏసుదాసు కోడలు పూజా మాణిక్యం (32) నవమాసాలు నిండటంతో రెండో కాన్పు కోసం వలసపాకలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం చేరింది. ఫ్రీ డెలివరీ కావడంతో ఆమెకు మధ్యాహ్నం సమయంలో నొప్పులు వచ్చాయి. దీంతో, ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్లారు. గైనకాలజిస్ట్ లేకుండానే భార్యాభర్తలైన వైద్యుల పర్యవేక్షణలో ప్రసవానికి చర్యలు చేపట్టారు. రాత్రి 8.30 గంటల సమయంలో మాణిక్యానికి పురుడు వచ్చింది. అయితే, పుట్టిన బిడ్డ మృతి చెందడంతో పాటు మాణిక్యానికి రక్తస్రావం ఆగలేదు. దీంతో, కంగారు పడిన వైద్యులు రాత్రి తొమ్మిది గంటలకు గైనకాలజిస్టును రప్పించారు. ఆమె పర్యవేక్షణలో రక్తస్రావం అరికట్టేందుకు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాత్రి 11.30 గంటలకు మాణిక్యం చనిపోయినట్టు ప్రకటించారు. దీంతో, అప్పటి వరకు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున విలపించారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆస్పత్రిలో ఆందోళన చేశారు. భార్యాభర్తలైన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కోడలు మృతి చెందిందని ఏసుదాసు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు డాక్టర్‌గా ఉన్న భార్య, ఆమె భర్త కనీస సదుపాయాలు, నిఫుణులు కూడా లేకుండా నాటుగా వైద్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొందని బంధువులు ఆందోళన చేశారు. మృతురాలి భర్త వాసిరెడ్డి రమేష్‌బాబు ఫిర్యాదు మేరకు వైద్యులు వీర్రాజు, కరుణశ్రీ, గైనకాలజిస్టు వైద్యురాలిపై కేసు నమోదు చేశామని సీఐ సీహెచ్ ప్రకాష్ తెలిపారు. గర్భిణి మృతిపై సమాచారం అందుకున్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) అనిత సోమవారం ఆస్పత్రిని సందర్శించి, జరిగిన ఘటనపై విచారణ జరిపారు. ఆస్పత్రి వైద్యులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.


