ఫ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో
నేడే గుర్తుల కేటాయింపు
ఫ బ్యాలెట్‌పై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు
ఉండవు
ఫ సీరియల్ నంబర్లు, గుర్తులే ఆధారం
ఫ ఓటర్లు మర్చిపోతే అభ్యర్థుల భవితవ్యం తారుమారే
ద్వారకాతిరుమల/ అంబాజీపేట: నిన్నటి వరకు ఓ లెక్క.. నేటి నుంచి మరో లెక్క! రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు సోమవారం ఎన్నికల గుర్తులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటి వరకు ఒక లెక్కగా సాగిన ఎన్నికల ప్రచారం.. గుర్తుల కేటాయింపుతో మరో మలుపు తిరగనుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు చేరవేసేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అయితే ఈ సారి ఓటర్లు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే, బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం సీరియల్ నంబర్లు, ఎన్నికల గుర్తులు మాత్రమే ఉంటాయి. దీంతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి గుర్తును ముందుగానే గుర్తుంచుకోవాలి. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ పింక్ రంగులో, వార్డు సభ్యులకు సంబంధించినది తెలుపు రంగులో ఉంటుంది. ఓటర్లు రెండు బ్యాలెట్లపై తమకు నచ్చిన అభ్యర్థుల గుర్తులను సరిగ్గా గుర్తించాల్సి ఉంటుంది.
విద్యావంతులూ గుర్తుంచుకోవాల్సిందే!
గతంలో నిరక్షరాస్యులైన ఓటర్లు బ్యాలెట్‌పై అభ్యర్థుల పేర్లు చదవలేక గుర్తుల ఆధారంగానే ఓటు వేసేవారు. అందుకే ఎన్నికల గుర్తును గుర్తుంచుకోవడం అప్పట్లో కీలకంగా ఉండేది. ప్రస్తుతం విద్యావంతులూ ఆ విధానాన్ని పాటించాల్సిందే. ఎందుకంటే బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు ఎక్కడా కనబడవు. కేవలం గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సర్పంచ్‌కు ఒక గుర్తు.. వార్డు సభ్యుడికి మరో గుర్తు గుర్తుంచుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా తాము మద్దతు ఇవ్వాలనుకున్న అభ్యర్థికి కాకుండా మరొకరికి ఓటు పడే అవకాశం ఉంది. అందుకే గుర్తుల కేటాయింపు తర్వాత అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించనుండగా.. ఓటర్లు సైతం వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఉత్తమ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గుర్తులు వచ్చిన వెంటనే తమ ప్రచారాలను ముమ్మరం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు.
ఎలా కేటాయిస్తారంటే!
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో తెలుగు అక్షరమాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. నామినేషన్ పత్రంలో పేర్కొన్న పేరులోని మొదటి అక్షరం ఆధారంగా సీరియల్ నంబరు, గుర్తును కేటాయిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల పేర్ల మొదటి అక్షరం ఒకటే అయితే గుణింతాల క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ ఒకేలా ఉంటే ఇంటి పేరును కాకుండా అభ్యర్థి అసలు పేరులోని మొదటి అక్షరాన్ని పరిశీలిస్తారు. అది కూడా ఒకటే అయితే రెండో అక్షరాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని విధాలా పేర్లు ఒకేలా ఉన్న సందర్భంలో ముందుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చి గుర్తు కేటాయిస్తారు.


