కిర్లంపూడి: సాంకేతిక కారణాలు చూపించి వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న గండికోట అరుణ నామినేషన్ తిరస్కరించడం దారుణమని మాజీ మంత్రి, ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాట్రావులపల్లి సర్పంచ్ అభ్యర్థిగా అరుణ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న జరిగిన పరిశీలనలో భాగంగా ఆమె భర్త వీర వెంకటరావు పేరిట ఆధార్, రేషన్, ఐడీ కార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ కుల ధ్రువీకరణ పత్రంలో ఉన్న పేరులో ‘వి’ అనే అక్షరం తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆ నెపంతో అరుణ నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు స్థానిక ఎన్నికల అప్పిలేట్ అధికారి అయిన పెద్దాపురం ఆర్‌డీఓ కార్యాలయానికి వెళ్తే అధికారులు అందుబాటులో లేకపోవడం మరింత దారుణమని తోట నరసింహం మండిపడ్డారు. నియోజకవర్గంలోని ఎన్నికల సంబంధిత సమస్యలపై కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేయాల్సిందిగా కోరామని వెల్లడించారు.


