జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతరాజ్‌ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతరాజ్‌

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

వైస్‌ చైర్‌పర్సన్‌గా పంపన రాజేశ్వరీదేవి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాల పునర్విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బుర్రా దివ్య సునీతరాజ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా పంపన రాజేశ్వరీదేవి ఎన్నికయ్యారు. జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌, ఎన్నికల పరిశీలకురాలు బి.లావణ్యవేణి హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఆశించిన కాకినాడ రూరల్‌ జెడ్పీటీసీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. దీంతో, సుమారు రెండు గంటలు ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత జిల్లాలోని 20 మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులతో అక్షర క్రమంలో కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లుగా సునీతరాజ్‌, పంపన రాజేశ్వరీదేవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్లూ విదేశాల్లో ఉన్న తాను మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని సునీతరాజ్‌ అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ సీఈఓ వీవీఎస్‌ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

14 మంది పోలింగ్‌ సిబ్బందికి

షోకాజ్‌ నోటీసులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్‌ సిబ్బందిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ చర్యలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. యు.కొత్తపల్లి మండలంలో ఎన్నికల విధుల నిర్వహణకు నియమితులైన ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓలు) నలుగురు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓలు) పది మంది విధులకు హాజరు కాలేదని ఎంపీడీఓ నివేదిక సమర్పించారు. మొత్తం 14 మంది సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆ నివేదికను పరిశీలించిన కలెక్టర్‌ ఆ 14 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన 24 గంటల్లోగా గైర్హాజరుకు గల కారణాలను వివరిస్తూ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా వివరణ ఇవ్వకపోయినా, సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

ఎన్నికల ఖర్చులు

ఇప్పించండి సార్‌!

● సొంత నిధులు వెచ్చించి

విధుల నిర్వహణ

● కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన

పంచాయతీ కార్యదర్శులు

రంపచోడవరం: ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణకు తమ సొంత నిధులు ఖర్చు చేశామని, ఆ సొమ్ము ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని, ఆ సొమ్ము వెంటనే రీయింబర్స్‌ కోరుతూ వారు కలెక్టర్‌ కె.దినేష్‌ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల విధుల నిర్వహణ సందర్భంగా అవసరమైన ఖర్చులను ముందుగా తమ సొంత నిధులతో సమకూర్చుకోవాలని, అనంతరం నిధులు మంజూరైనప్పుడు తిరిగి చెల్లిస్తామని సంబంధిత ఎంపీడీఓలు, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని కలెక్టర్‌కు వివరించారు. అధికారుల సూచనల మేరకు కొంతమంది అప్పులు చేసి, మరికొంతమంది వ్యక్తిగత పొదుపు మొత్తాలను వినియోగించి ఎన్నికల విధులు నిర్వహించామని చెప్పారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ ఈ సమస్య ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, ఖర్చులు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, ఆ వినతిపత్రంపై సంతకం చేసి తదుపరి చర్యల నిమిత్తం పీఏకు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిని సైతం పంచాయతీ కార్యదర్శులు కలిసి సమస్యను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement