● ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించారంటూ జనసేన ఎంపీటీసీ సభ్యుల ఆందోళన
● 16 మంది మద్దతున్న అభ్యర్థిని కాదని
ఈ పదవిని మరొకరికి కట్టబెట్టారని
ఎంపీ ఉదయ శ్రీనివాస్‌పై ఆగ్రహం
● తీవ్ర ఉద్రిక్తతల నడుమ
ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా
కొత్తపల్లి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఎన్నికలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, ఏకపక్షంగా వ్యవహరించారంటూ జనసేన పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన 14, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 4 స్థానాలను గెలుచుకోగా, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు గురువారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ క్రమంలో పొన్నాడ–1 ఎంపీటీసీ సభ్యుడు వాడ్ర ధనబాబుకు 16 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు.
ఎంపీ ప్రయత్నాలకు చెక్
అయితే, తన అనుచరుడైన ఉప్పాడ–1 ఎంపీటీసీ సభ్యుడిని ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చక్రం తిప్పారు. ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం జనసేన పార్టీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యాక విప్‌పై సంతకాలు చేసిన అభ్యర్థులు గంటా విజయ కుమార్‌కే మద్దతు తెలిపారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ ప్రకటించారు. దీనిపై ధనబాబు వర్గం మండిపడింది. విజయ కుమార్‌కు తాము ఎటువంటి మద్దతూ తెలపలేదని, తమకు 16 మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ, తమ అభ్యర్థిని పక్కన పెట్టి, ఎంపీ సమక్షంలోనే విజయ కుమార్‌కు ఎంపీపీ పదవి కట్టబెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించారంటూ వారు ఆందోళనకు దిగారు. మెజార్టీ సభ్యుల మద్దతున్న ధనబాబును కాకుండా విజయ కుమార్‌ను ఎంపీపీగా ఎన్నుకున్నట్లు అధికారులు నిర్ధారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభ్యులతో చేతులెత్తించి ఎంపీపీ ప్రత్యక్ష పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయంలో నిరసన తెలిపారు.
ఎంపీ సమక్షంలోనే ఎంపీటీసీ సభ్యుడిపై దాడి
ధనబాబు వర్గీయుల ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఎంపీపీగా ప్రకటించిన ఎంపీ అనుచరుడు గంటా విజయ్ కుమార్ దుందుడుకుగా వ్యవహరించడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పక్షాల వివాదం నేపథ్యంలో అతడు ధనబాబు వర్గంలోని మూలపేట–2 ఎంపీటీసీ సభ్యుడు యలమంచిలి ఉమామహేశ్వరరావు చెంపపై కొట్టారు. దీంతో, తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించకుండా ఎంపీపీ ఎన్నిక నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధనబాబు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డుపై ఎంపీ వర్గీయుల బైఠాయింపు
ఇదిలా ఉండగా ఎంపీ వర్గానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రావు అక్షయ్ తన వర్గం సభ్యులతో కలిసి గంటా విజయ్ కుమార్‌కు మద్దతుగా ఎంపీడీఓ కార్లాయం ఎదురుగా బైఠాయించి, ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వంలోనే ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారంటూ తీవ్ర స్ధాయిలో విమర్శించారు. వారి ఆందోళనతో ఉప్పాడ – పిఠాపురం రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నా పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం గమనార్హం.
ఎన్నిక నేటికి వాయిదా
ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేసినట్లు ఎన్నికల నిర్వహణాధికారి మనోజ్ కుమార్ తెలిపారు. ఎన్నికలను పరోక్ష పద్ధతి ద్వారానే నిర్వహిస్తామని చెప్పారు. విప్‌పై సభ్యులు సంతకాలు చేస్తే పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అంగీకరించినట్లు మాత్రమేనని, సభ్యుల ఆమోదం మేరకే ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు.
మేమంటే ఏమిటో వచ్చే
ఎన్నికల్లో చూపిస్తాం
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోనే కూటమి సభ్యులమైన మాపై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యవహరించిన తీరు చాలా దారుణం. ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవవలసిన ఎంపీపీని తానే నిర్ణయించి, అధికారులను భయభ్రాంతులకు గురి చేసి, తాను చెప్పిన పేరే ప్రకటించాలని ఒత్తిడి చేయడం దారుణం. మెజార్టీ సభ్యులుండగా ఎన్నిక నిర్వహించకుండా వాయిదా వేసినట్లు చెప్పడమేంటి? ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి రాజకీయం చేయడం దారుణం. ఆయన ఎంపీ పదవిలో ఉండేది సుమారు రెండున్నరేళ్లు మాత్రమే. మేముండేది ఐదేళ్లు. మేమంటే ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. అధికారం ఉందని అహంకారంతో అధికారులపై ఒత్తిడి తేవడం దారుణం.
– బిళ్ళకుర్తి సుధాకర్‌రెడ్డి,
ఎంపీటీసీ–1, నాగులాపల్లి
దాడి దారుణం
ఎటువంటి ఎన్నికా జరగకుండా ఎంపీ ఒక తెల్ల కాగితంపై పేర్లు రాసుకుని వచ్చి ఎన్నిక జరిగినట్లుగా అధికారులతో చెప్పి, ప్రకటించాలని అనడం దారుణం. ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇలా చేయడం తీవ్ర అభ్యంతరకరం. అదేమిటని ప్రశ్నించినందుకు ఎంపీపీగా పోటీలో ఉన్న గంటా విజయ్ కుమార్ నాపై దాడి చేయడం మరీ దారుణం. ఈ దాడిపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ఎంపీటీసీ సభ్యులు 24 మందితో ఎన్నిక జరగాలి. మెజారిటీ సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారినే ఎంపీపీగా ప్రకటించాలి.
– యలమంచిలి ఉమామహేశ్వరరావు,
ఎంపీటీసీ–2, మూలపేట


