ఆక్వాన్‌ అలజడి | - | Sakshi
Sakshi News home page

ఆక్వాన్‌ అలజడి

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరుస తుపాన్లు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే అర్నబ్‌, మురసు తుపాన్లు వారిని కోలుకోలేని దెబ్బ తీయగా.. తాజాగా ఆక్వాన్‌ అతి తీవ్ర తుపాను హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి.

అర్నబ్‌తో అతలాకుతలం

ఇప్పటికే గత నెల 28న విరుచుకుపడిన అర్నబ్‌ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వరి పంట నేలకొరిగి, నీట మునిగింది. ఫలితంగా ధాన్యం రంగు మారడం, మొలకెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బ తిన్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 71,136 మంది రైతులు ప్రభావితమయ్యారని, రూ.97 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 80 శాతం భూమిలో లక్ష మందికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వరి సాగుకు ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. తుపాను విరుచుకుపడటంతో పెట్టుబడి ఖర్చులు కూడా చేతికందని దుస్థితిలో వారు కూరుకుపోయారు. రైతులు ఇంతగా నష్టపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ నయాపైసా కూడా పరిహారం ఇవ్వలేదు.

మరోసారి ముంచేసిన ‘మురసు’

అర్నబ్‌ తుపాను నష్టాల నుంచి కోలుకోక ముందే.. సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే మురసు తుపాను రైతులను మరోసారి ముంచేసింది. ఈ నెల 3న దక్షిణ కోస్తాలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లాయి. పంటలు మళ్లీ జలమయమవడంతో రైతులకు తేరుకోలేని దెబ్బ తగిలింది.

ఇప్పుడు ఆక్వాన్‌ టెన్షన్‌

పంట చేతికందుతుందనుకున్న వేళ వరుసగా రెండు తుపాన్లు విరుచుకుపడటంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు తాజా తుపాను హెచ్చరికలతో మరింతగా బెంబేలెత్తుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్‌ తీవ్ర తుపాను నెమ్మదిగా కదులుతూ యానాం – ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా మధ్య శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 – 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీగా, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

దిక్కు తోచని అన్నదాత

తాజా తుపాను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తుపాన్లకు జిల్లావ్యాప్తంగా పోయిన పంట పోగా మిగిలినచోట్ల ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో మళ్లీ తుపాను ముప్పు తలెత్తడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సాధారణ సాగు 90,298 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 87,023 హెక్టార్లలో వరి సాగు జరిగింది. ఇప్పటి వరకూ 8,865 హెక్టార్లలో (10.02 శాతం) మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. వరుస తుపాన్లకు దెబ్బ తినగా మిగిలిన పంట కోతకు సిద్ధంగా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో తుపాను హెచ్చరికలు రావడంతో గత్యంతరం లేక పలువురు రైతులు తాత్కాలికంగా కోతలు వాయిదా వేసుకున్నారు. కోతలు పూర్తయి, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు నానా అగచాట్లూ పడుతున్నారు. మరోవైపు తుపాను ప్రభావంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలకొరిగే అవకాశం ఉంది. పొలాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఏవిధంగా కాపాడుకోవాలో, అదనంగా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో అర్థం కాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా విపత్తులు విరుచుకుపడుతున్నా కూటమి ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడంలో మొండిచేయి చూపిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌ నెలాఖరులో వచ్చిన మోంథా తుపాను ధాటికి జిల్లాలో 50,812 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లితే ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగానే లెక్క తేల్చింది. ఈ విపత్తు సంభవించి ఏడాదవుతున్నా నేటికీ రైతులకు నయా పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ ఏడాది మళ్లీ తుపాన్లకు పంట నష్టం జరిగినా సర్కారు కనికరం చూపడం లేదు. విపత్తుల వేళ ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతేమవుతుందోనని రైతులు కలవరపడుతున్నారు.

యు.కొత్తపల్లి మండలంలో

లారీపై ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు

జిల్లాలో వరి కోతలు ఇలా...

మండలం వరి సాగు కోతలు శాతం

విస్తీర్ణం (హెక్టార్లు)

(హెక్టార్లు)

కాకినాడ రూరల్‌ 1,681 18 1.1

సామర్లకోట 9,857 3,256 33

పెదపూడి 7,600 400 5.3

కరప 6,117 89 1.5

కాజులూరు 7,762 80 1

తాళ్లరేవు 3,644 46 1.3

పిఠాపురం 8,307 140 1.7

గొల్లప్రోలు 4,743 280 5.9

యు.కొత్తపల్లి 5,003 1,500 30

పెద్దాపురం 3,986 50 1.3

కిర్లంపూడి 5,108 230 4.5

గండేపల్లి 3,362 1,887 56.1

ప్రత్తిపాడు 2,459 320 13

ఏలేశ్వరం 3,227 350 10.8

తొండంగి 3,560 170 4.8

వాతావరణంలో మార్పులు

నెమ్మదిగా కదులుతున్న తీవ్ర తుపాను

యానాం – దక్షిణ ఒడిశా మధ్య

రేపు తీరం దాటే అవకాశం

పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు

ఇప్పటికే రెండు తుపాన్లతో

పంటలు సర్వనాశనం

తాజా హెచ్చరికలతో

రైతుల గుండెల్లో రైళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement