కిర్లంపూడి: వంచన, అరాచకం, అవినీతి, అక్రమాలతో సాగుతున్న చంద్రబాబు పాలనపై విసుగు చెందుతున్న కూటమి శ్రేణులు.. పెద్ద సంఖ్యలో ఆ పార్టీలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. తాజాగా, ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొప్పన రాజబాబుతో పాటు మరో 10 కుటుంబాల వారు, ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలో అదే పార్టీకి చెందిన సోమాల అప్పారావు, మరో 60 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి, దివంగత ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు సమక్షంలో పార్టీకి జైకొట్టారు. వారికి గిరిబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ విజయానికి గిరిబాబుతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పేదల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మరిచిపోలేదన్నారు. గిరిబాబు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ పటిష్టతకు కృషి చేసే ప్రతి ఒక్కరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు రామిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు.


