అన్నవరం.. తుపాను కలవరం | - | Sakshi
Sakshi News home page

అన్నవరం.. తుపాను కలవరం

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన అన్నవరం దేవస్థానాన్ని ఆక్వాన్‌ తుపాను గుబులు వెంటాడుతోంది. సత్యదేవుని సన్నిధికి కార్తిక మాసం రెండో వారం నుంచే భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో గురువారం నుంచి మంగళవారం వరకూ వరుస పర్వదినాలు కావడంతో లక్షలాదిగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు. గురువారం కార్తిక శుద్ధ దశమి సందర్భంగా 50 వేల మంది, శుక్రవారం ఏకాదశి పర్వదినం కావడంతో సుమారు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే, శనివారం క్షీరాబ్ది ద్వాదశి, ఆదివారం సెలవు రోజు, ఆ తరువాత కార్తిక సోమవారం, మంగళవారం కార్తిక పౌర్ణమి పర్వదినాలు కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు రావచ్చని భావించారు. ఈ ఆరు రోజుల్లో సత్యదేవుని వ్రతాలు 35 వేల నుంచి 40 వేల వరకూ జరుగుతాయని, స్వామివారికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, తాజాగా తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాలు కురిసి ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోతే దేవస్థానం ఆదాయానికి కూడా గండి పడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2023 కార్తికంలో మిచాంగ్‌, 2025 కార్తికం తొలి వారంలో మోంథా తుపాన్లు వచ్చాయి. వీటి ప్రభావంతో ఆ కార్తిక మాసాల్లో భక్తుల రాక తగ్గడంతో ఆదాయానికి గండి పడింది. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణపై ప్రభావం!

క్షీరాబ్ది ద్వాదశి పర్వదినమైన శనివారం రాత్రి పంపా జలాశయంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెప్పోత్సవంలో ఉపయోగించే పంటుపై జలాశయంలో బుధవారం ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. పంటును హంసవాహనంగా అలంకరించడంతో పాటు విద్యుద్దీపాలకరణ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇన్ని చేసినా తుపాను ప్రభావంతో శనివారం వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటనే మీమాంస అధికారుల్లో ఉంది. సాధారణంగా వర్షం కురిసే సమయంలో సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి వెలుపలకు తీసుకురారు. ఒక వేళ పల్లకీ మీద తీసుకువచ్చినా ఉత్సవమూర్తుల మీద వర్షం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, తెప్పోత్సవంలో స్వామి, అమ్మవారి పూజలు ఆరుబయటే నిర్వహిస్తారు. హంస వాహనంపై కూడా అలంకరణ తప్ప స్వామి, అమ్మవారు ఉత్సవమూర్తులు తడవకుండా పెద్దగా ఏర్పాట్లేమీ ఉండవు. సుమారు గంటపాటు తెప్పోత్సవం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వర్షం కురిస్తే తెప్పోత్సవం నిర్వహణ ఇబ్బందేననే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సత్యదేవుని గిరి ప్రదక్షణకు కూడా చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం పల్లకీ మీద, మధ్యాహ్నం సత్యరథం మీద గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ అనంతరం సాయంత్రం 6 గంటలకు పంపా జలాశయం వద్ద సత్యదేవుని నదీ హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే వీటిని ఏవిధంగా నిర్వహించాలో అర్థం కాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

నేటి నుంచి ఆరు రోజుల పాటు పర్వదినాలు

‘ఆక్వాన్‌’ ప్రభావం చూపితే

తగ్గనున్న భక్తులు

అదే జరిగితే దేవస్థానం ఆదాయానికి

భారీగా గండి పడే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement