బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నూతన జెడ్పీటీసీ సభ్యులు ఎన్నికై న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. తొలుత ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని లక్ష్మణరావు తెలిపారు. అలాగే, గురువారం ఉదయం 10 గంటలకు జిల్లాలోని మండల పరిషత్‌ల ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఒక కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికతో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ వివరించారు.
బాధ్యతాయుతంగా
పోలింగ్ విధులు
కాకినాడ లీగల్: నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్ విధులు అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. ఈ ఎన్నికల నిర్వహణపై పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ అధికారులు (పీఓ), సహాయ పోలింగ్ అధికారుల (ఏపీఓ) శిక్షణను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికలకు మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 732 మంది సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. బ్యాలెట్ బాక్సులను ఏవిధంగా సీల్ చేయాలి, ఎన్నికల పత్రాలు, చట్టబద్ధమైన సామగ్రిని ఏవిధంగా నిర్వహించాలనే అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి, పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులను తిరిగి అప్పగించేంత వరకూ సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లోనే తమకు కేటాయించిన బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితా పత్రాలు, బ్యాలెట్ బాక్సులను తప్పనిసరిగా ముందుగానే సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాల లెక్కలు, పీఓ డైరీ, చాలెంజింగ్, టెండర్ ఓట్ల వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, పీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మెహర్ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మలపల్లి నామినేషన్
ప్రక్రియపై విచారణ జరపాలి
అల్లవరం: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజైన మంగళవారం గడువు ముగిసిన తర్వాత వచ్చిన తుమ్మలపల్లికి చెందిన అభ్యర్థి నుంచి నామినేషన్ ఎలా స్వీకరిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్‌లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ను అమలాపురంలోని ఆయన బంగ్లాలో మంగళవారం రాత్రి వారు కలిశారు. మొగళ్లమూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియకు తుమ్మలపల్లి సర్పంచ్ అభ్యర్థి వడ్డి సుభాషిణి నిర్ణీత సమయానికి రాకపోవడం, నామినేషన్ పత్రాలు సక్రమంగా లేకపోవడం, టోకెన్ జారీ తదితర అంశాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. గడువు దాటిన తర్వాత వచ్చిన సుభాషిణికి టోకెన్ జారీ చేసి, నామినేషన్ స్వీకరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. నామినేషన్ స్వీకరణ, టోకెన్ జారీ తదితర అంశాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా పరిశీలన జరిపి, వాస్తవాలను ప్రజలకు వివరించాలని అనురాధ, శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నామినేషన్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, కూటమి నేతలకు అండగా ఉండి, సుభాషిణితో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారని అనురాధ చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై ఆర్‌డీవో సరళావతికి కూడా బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన సుభాషిణి నామినేషన్‌ను రద్దు చేయాలని, ఈ వ్యవహారానికి సహకరించిన ఎన్నికల అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


