23న పోస్టల్‌ బ్యాలెట్‌ | - | Sakshi
Sakshi News home page

23న పోస్టల్‌ బ్యాలెట్‌

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

కాకినాడ లీగల్‌: ఈ నెల 26న జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 23న పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. ఎన్నికల అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ గురువారం ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉద్యోగులు కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్యాలయం మీటింగ్‌ హాలులో పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే సిబ్బంది ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు నంబరుతో పాటు చెల్లుబాటయ్యే ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

నామినేషన్ల ప్రక్రియ

పారదర్శకంగా నిర్వహించాలి

పిఠాపురం రూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. చిత్రాడలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎటువంటి పొరపాట్లకూ తావు లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందిస్తూ, నిర్దేశిత విధానాల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, సంబంధిత రిజిస్టర్లు, ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

మేయర్‌ బరిలో పది మంది..

కాకినాడ లీగల్‌: నగర పాలక సంస్థ మేయర్‌ ఎన్నికల తుది బరిలో పది మంది అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానానికి మొత్తం 21 మంది నామినేషన్లు వేశారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ సెట్లు వేయడంతో మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21 మందిలో 11 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పోటీలో పది మంది మిగిలారు. వీరిలో వైఎస్సార్‌ సీపీ నుంచి కాద సత్యశ్రీ, ఆకుల భవాని (జనసేన), కట్టా పద్మజ (కాంగ్రెస్‌), వాసంశెట్టి ఆశాకిరణ్‌ (బీఎస్పీ), గొలుసు భవాని (తెలుగు నవగర్జన), మామిడి స్వాతి (తెలుగు జనతా పార్టీ) ఉన్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా చింతా మైత్రి అద్వైత, టేకుమూడి సాయిలక్ష్మి, పిల్లి లహరి, హఫీజున్నిసా మొహమ్మద్‌ బరిలో నిలిచారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ఏలూరి నాగకన్య, కంచి వేనిశ, కడిలి ఈశ్వరి, కసిరెడ్డి వినూష, గుత్తుల వెంకట శుభ, చొల్లంగి సుబ్బలక్ష్మి, పెంకే గౌరీ మనోహరి, లక్ష్మి ప్రసింగి, పసుపులేటి వెంకటలక్ష్మి, వాసంశెట్టి సత్య, అందె హరిక ఉన్నారు.

తొలగించిన 1.95 లక్షల

ఓట్లపై పునఃపరిశీలన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) డి.తిప్పే నాయక్‌ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్‌ ప్రక్రియలో భాగంగా జాబితా నుంచి తొలగించిన 1,95,602 మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకూ బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) ద్వారా రెండో విడత పునఃపరిశీలన చేపడతామని వివరించారు. వాటిపై డిసెంబర్‌ 15 నుంచి 30వ తేదీ వరకూ క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. సర్‌పై డిసెంబర్‌ 12 వరకు అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించి, అదే రోజు ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.

ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా జాబితా షెడ్యూల్‌

శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదాను డిసెంబర్‌ 23న ప్రచురిస్తామని డీఆర్‌ఓ తెలిపారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 12 వరకూ క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరించి, జనవరి 27లోగా పరిష్కరించి, ఫిబ్రవరి 2న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement