రేషన్‌ షాపుల్లో.. | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపుల్లో..

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

లో

శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సుగర్‌ డౌన్‌

● కేవలం బియ్యం పంపిణీతో సరి

● చౌక దుకాణాల్లో రెండు నెలలుగా

నిలిచిన చక్కెర సరఫరా

● రెండేళ్లుగా కందిపప్పు

కూడా ఇవ్వని సర్కారు

● రేషన్‌ లబ్ధిదారుల అసంతృప్తి

● బహిరంగ మార్కెట్లో కొనలేక అవస్థలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీ లేదా ఉచితంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులకు చౌక ధరలకే ఆహార ధాన్యాలు పొందే హక్కు కల్పించారు. రేషన్‌ దుకాణాల ద్వారా గతంలో బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలు, పామాయిల్‌, ఉప్పు, పసుపు తదితర నిత్యావసరాలు అందించేవారు. కాలక్రమంగా వీటిలో పలు సరుకుల పంపిణీని నిలిపివేయగా, బియ్యం, కందిపప్పు, పంచదార మాత్రమే ఇస్తున్నారు. వీటికి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు మంగళం పాడేయడంపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రేషన్‌ దుకాణాల ద్వారా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందిస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో సుమారు 6.50 లక్షల మంది తెల్ల రేషన్‌ కార్డుదారులున్నారు. వీరందరికీ జిల్లాలోని 1,060 రేషన్‌ షాపుల ద్వారా ప్రతి నెలా సుమారు 325 టన్నుల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గత రెండు నెలలుగా రేషన్‌ దుకాణాలకు ప్రభుత్వం ఒక్క కిలో పంచదార కూడా సరఫరా చేయడం లేదు. దీంతో, కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రేషన్‌ షాపుల ద్వారా ప్రతి కార్డుపై అరకిలో పంచదార రూ.17కు ఇచ్చేవారు. అదనంగా అవసరం ఉన్న వారు డీలర్‌ను బతిమాలుకుంటే, స్టాక్‌ అందుబాటు లో ఉంటే మరో అరకిలో కూడా పొందేవారు. దీంతో, కార్డుదారులకు కాస్తయినా ఊరట లభించేది. ప్రస్తు తం బహిరంగ మార్కెట్లో కిలో పంచదార ధర రూ.80 దాటింది. సరిగ్గా ఇదే సమయంలో రేషన్‌ షాపుల ద్వా రా పంచదార పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో బయటి మార్కెట్లో అధిక ధరలకు పంచదార కొనలేక సామాన్యులు నానా ఇక్కట్లూ పడుతున్నారు.

కందిపప్పు సరఫరాకూ మంగళం

గతంలో రేషన్‌ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.67కే పంపిణీ చేసేవారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల (ఎండీయూ వాహనాలు) ద్వారా కార్డుదారులకు వారి ఇళ్ల వద్దనే బియ్యం, పంచదార, కందిపప్పు, రాగుల వంటి సరుకులు అందించేవారు. దీంతో, పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండేది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందిపప్పు సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో, కార్డుదారులు బహిరంగ మార్కెట్లోనే అధిక ధరలకు కందిపప్పు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఇది మరింత భారంగా మారింది. వారి కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ముఖ్యంగా రోజు కూలీలు, చిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

పామాయిల్‌.. హామీలకే పరిమితం

రేషన్‌ దుకాణాల ద్వారా పామాయిల్‌ కూడా సబ్సిడీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఒకవైపు పంచదార, కందిపప్పు సరఫరా నిలిచిపోగా, మరోవైపు పామాయిల్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో రేషన్‌ దుకాణాలు కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ బియ్యం ఉచితంగా ఇస్తున్నప్పటికీ వంటకు అవసరమైన పంచదార, కందిపప్పు వంటి సరుకులు ఇవ్వకపోతే ప్రయోజనమేమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. చౌక దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం వాటి సరఫరాపై నిర్లక్ష్యం వహిస్తోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచదార, కందిపప్పు పంపిణీని వెంటనే పునరుద్ధరించాలని, సబ్సిడీపై పామాయిల్‌ కూడా ఇవ్వాలని కార్డుదారులు కోరుతున్నారు.

8

పంచదార రాలేదని చెబుతున్నారు

తాము పంచదార కోసం డబ్బులు కట్టినా స్టాకు పంపలేదని రేషన్‌ డీలర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. కందిపప్పు పంపిణీని ఆపేసిన ప్రభుత్వం ఇప్పుడు పంచదార కూడా నిలిపివేసింది. దీంతో, బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కిలో నూనె రూ.130 పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం నిరుపేదలను పట్టించుకోవడం లేదు.

– పోకనాటి ప్రభాకరమూర్తి, రమణయ్యపేట, కాకినాడ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement