మోగిన సంగ్రామభేరి | - | Sakshi
Sakshi News home page

మోగిన సంగ్రామభేరి

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పల్లె సారథుల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించి శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 17వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. దీంతో, పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. తమ అనుచరులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు కూడా పలువురు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా తమ మద్దతుదారులను బరిలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో సామాజిక సమీకరణలు, రాజకీయ బలాబలాలు, స్థానిక సమస్యలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత పెరగనుంది.

ముమ్మరంగా ఏర్పాట్లు

మరోవైపు ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే అవసరమైన పోలింగ్‌ సిబ్బందిని నియమించి, వారికి ఎన్నికల విధులపై అవసరమైన శిక్షణ, మార్గదర్శకాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలీసు బందోబస్తు, నిఘా కట్టుదిట్టం చేయనున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు.

కార్పొరేషన్‌ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు

నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో మేయర్‌, 66 వార్డు సభ్యుల ఎన్నికలకు గాను మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 26న పోలింగ్‌ నిర్వహించి, 30వ తేదీన స్థానిక రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారని, వాటిని 17న పరిశీలిస్తారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 19వ తేదీ వరకూ గడువు ఉందన్నారు. మేయర్‌ స్థానానికి నగర పాలక సంస్థ కార్యాలయంలోను, కార్పొరేటర్‌ అభ్యర్థులకు 17 కేంద్రాల్లోను నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్‌ చెప్పారు.

పోలింగ్‌

ఈ నెల 26 ఉదయం 7 నుంచి

మధ్యాహ్నం ఒంటిగంట వరకు,

అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

జిల్లాలో 93 సర్పంచ్‌, 1,064 వార్డు స్థానాలకు 26న నిర్వహణ

పల్లెల్లో రాజకీయ సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement