సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నగర అభివృద్ధే అజెండాగా ప్రజల్లోకి వెళతాం. చేయగలిగిందే చెబుతాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆ పార్టీ కాకినాడ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికలకు తాము ఎన్నడూ వెనుకాడేది లేదని, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కార్పొరేషన్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణను ప్రభుత్వమే వివాదాస్పదంగా మార్చిందన్నారు. కాకినాడ రూరల్‌కు సంబంధించిన 42, 48 డివిజన్లు, 13 ఏళ్లుగా కార్పొరేషన్‌లో కలిపిన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీన గ్రామాల సమస్యను పరిష్కరించాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం చేయని దౌర్జన్యాలు, అక్రమాలను కూటమి చేసిందన్నారు. ఎన్ని దారుణాలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీకి ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కాకినాడ సిటీలో వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో దేశంలోనే టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా కాకినాడ నిలిచిందని గుర్తు చేశారు. అలాంటి నగరంలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. కాకినాడ ప్రజలకు మళ్లీ అభివృద్ధి, సంక్షేమం అందాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల్లో ‘చేయగలిగిందే చెబుతాం’ అనే నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు.
ద్వారంపూడి మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాకినాడలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కూటమి పాలనలో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ వైద్యుడు కాద వెంకట రమణ మాట్లాడుతూ మేయర్ అభ్యర్థిగా సత్యశ్రీని ప్రజలు ఆశీర్వదిస్తే కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ మాజీ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ అభ్యర్థుల
జాబితా విడుదల
కాకినాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. 39 డివిజన్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ద్వారంపూడి, కన్నబాబు ప్రకటించారు. మిగిలిన వారి వివరాలు శనివారం ప్రకటించి, నామినేషన్లు దాఖలు చేయించనున్నామని వెల్లడించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పార్టీలో కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని చెప్పారు. అలాంటి వారిని పార్టీ ఎన్నటికీ మర్చిపోదన్నారు. మేయర్ అభ్యర్థి ఎంపిక పలు సర్వేల ద్వారా జరిగిందని, మేయర్ స్థానం ఆశించి భంగపడిన వారు దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి పార్టీ తగిన ప్రాధాన్యం ఇస్తుందని భరోసా ఇచ్చారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌తో పాటు అన్ని కార్పొరేటర్ స్థానాల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, మహిళా విభాగం సిటీ అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే టాప్ టెన్‌లో నిలిచిన కాకినాడలో నేడు అధ్వాన పరిస్థితులు
వైఎస్సార్ సీపీతోనే మళ్లీ నగరాభివృద్ధి
కూటమి ప్రభుత్వంపై
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
‘చేయగలిగిందే చెబుతాం’
నినాదంతో ముందుకెళ్తాం
మాజీ మంత్రి కురసాల కన్నబాబు,
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వెల్లడి
నగర పాలక సంస్థ ఎన్నికలపై
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం


