అన్నవరం: రత్నగిరిపై డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ ద్వారా మాత్రమే వ్రతాలు, ప్రసాదం, దర్శనం, ఇతర సేవా టికెట్లు కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించారు. గతంలో మాదిరిగానే నగదుతో వివిధ సేవా టికెట్లు కొనుగోలు చేసేందుకు సత్యదేవుని భక్తులకు అవకాశం కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు ఇన్నాళ్లూ కేవలం డిజిటల్ పేమెంట్ల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చేది. దీంతో, వారు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ పలు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. తాజాగా దేవస్థానంలో భక్తుల ఇబ్బందులపై ‘దారి చూపు స్వామీ..! శీర్షికన గత శుక్రవారం కథనం ప్రచురించింది. రత్నగిరిపై ఎయిర్‌టెల్ మినహా మిగిలిన సెల్ టవర్లు లేకపోవడంతో సిగ్నల్స్ లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను కూడా ఆ కథనంలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో శుక్రవారం పర్యటించిన కమిషనర్ రామచంద్ర మోహన్ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకువెళ్లింది. దీనిపై ఆయన స్పందించారు. భక్తులు డిజిటల్ చెల్లింపులతో పాటు నగదుతో కూడా టికెట్లు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


