నిన్నటి వరకూ పిచ్చి మొక్కలు, తుప్పల నడుమ ఎవ్వరికీ కనిపించనట్టుగా ఉన్న పుట్టలు.. నాగుల చవితి పర్వదినమైన శుక్రవారం.. పసుపు, కుంకుమలతో కొత్త శోభను అద్దుకున్నాయి. వేకువజామునే తలస్నానాలు ఆచరించిన మహిళలు, భక్తులు పుట్టల వద్దకు చేరుకుని, నాగేంద్రుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు. చలిమిడి, చిమ్మిలి, తేగ ముక్కలతో పాటు ఆవు పాలు ఆ పుట్టలో వేస్తూ.. సకల జీవరాశులు క్షేమంగా ఉండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లేలా తమ కుటుంబాలను ఆశీర్వదించాలని మనసారా వేడుకున్నారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, నాగదేవత సన్నిధులకు భక్తులు పోటెత్తారు. దీంతో, ఆలయాలు, పుట్టల వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
– బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)


