హోరాహోరీగా జరిగిన ‘పరిషత్’ సంగ్రామంలో అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లోనే తేలనుంది.. ఇందులో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ శనివారం ఉదయం జరుగనుంది. అయితే ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. చివరికి గెలుపెవరిదో తేల్చేందుకు కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పరిషత్ పోరులో చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఉత్కంఠకు శనివారం తెర పడనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఎవరు దక్కించుకుంటారో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు రోజున అనుసరించాల్సిన విధానాలపై కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాకినాడ, పెద్దాపురం డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా 20 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు శనివారం కౌంటింగ్ నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను తొలుత కౌంటింగ్ కేంద్రానికి తీసుకువస్తారు. అనంతరం 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభిస్తారు. పెద్దాపురం, కాకినాడ డివిజన్ కేంద్రాల్లో లెక్కింపు చేపడతారు. పెద్దాపురం డివిజన్ కుసంబంధించి పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాలలో, కాకినాడ డివిజన్ సంబంధించి పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలుత ఎంపీటీసీ అనంతరం జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు. పెద్దాపురం కౌంటింగ్ కేంద్రం వద్ద 10 మండలాలాకు చెందిన ఎంపీటీసీ స్థానాలు, వాటి సెగ్మెంట్ల వారీగా జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. కాకినాడ పరిధిలో 10 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాకినాడలోని పీఆర్ కళాశాలలో నిర్వహిస్తారు.
కాకినాడ కౌంటింగ్ కేంద్రంలో..
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పెదపూడి, కాజులూరు, కరప, తాళ్లరేవు, కాకినాడ రూరల్, పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలతో పాటు పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సామర్లకోట, తొండంగి మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాల ఓట్ల లెక్కింపు ఇక్కడే నిర్వహిస్తారు.
పెద్దాపురం కౌంటింగ్ కేంద్రంలో..
పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గండేపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, శంఖవరం, ఏలేశ్వరం, కిర్లంపూడి, రౌతులపూడి, కోటనందూరు, పెద్దాపురం మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాల ఓట్ల లెక్కింపు పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కళాశాలలో జరుపుతారు.
నేటి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
కౌంటింగ్ ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి మండలానికి 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెగ్మెంట్‌ను ఒక్కో టేబుల్‌లో లెక్కించేలా ప్రణాళిక రూపొందించారు. కొన్ని మండలాల్లో 16 కన్నా ఎక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉన్నందున, అక్కడ రెండో రౌండ్ లెక్కింపు సైతం చేపట్టాల్సి ఉంటుంది. మిగిలిన మండలాల అన్నింటిలోనూ మొదటి రౌండ్‌లోనే ఫలితాలు వెల్లడయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలను పూర్తి స్థాయిలో ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మీడియాపై ఆంక్షలు
కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియాపై అధికారులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద లేకుండా ఎక్కడో దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా లెక్కింపు కేంద్రాల్లో ఏం జరుగుతుందో.. తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాను దూరం పెడితే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చన్న ఉద్దేశంతో దూరం పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి కళాశాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాపై అధికారుల ఆంక్షలు పెట్టారు. ఫ్యాన్లు, లైట్లు సరిగ్గా లేనిచోట కౌంటింగ్ కేంద్రాలకు దూరంగా మీడియా పాయింట్ పెట్టారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ అధికారులు మాట దాటవేస్తున్నారు.
నేడే ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్
జిల్లాలో రెండు చోట్ల లెక్కింపు కేంద్రాలు
మొత్తం 20 జెడ్పీటీసీ,
395 ఎంపీటీసీ స్థానాలు
ఒక మండలానికి
16 టేబుళ్ల చొప్పున ఏర్పాటు
పకడ్బందీ ఏర్పాట్లు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియతో కలసి పరిశీలించారు. శనివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి ఇస్తున్న శిక్షణను కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. కాకినాడ, పెద్దాపురం డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాల, కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి దాదాపు 16 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెగ్మెంట్‌ను ఒక్కో టేబుల్‌లో లెక్కించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన సూచించారు.


