● వైభవంగా ముగిసిన
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు
● గౌతమి నదీ తీరంలో
వేడుకగా చక్రస్నానం
ఆత్రేయపురం: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వేడుకను చూసి ముల్లోకాలు మురిశాయి.. వేంకటేశుని బ్రహ్మోత్సవాల వేళ భక్తి పారవశ్యం ప్రతిబింబించింది. కనుల పండువగా సాగిన వేడుకలో గోవింద నామస్మరణ మార్మోగింది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారంతో బ్రహ్మాండనాయకుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ముగిశారు. ఆలయాన్ని సహజ సిద్ధమైన పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో ఇల వైకుంఠంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. భారీ సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా గౌతమీ గోదావరి నదికి స్వామివారి సుదర్శన చక్రాన్ని తోడ్కొని వెళ్లారు. గౌతమి నదీ తీరం జనసంద్రంగా మారింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వేదికపై స్వామివారితో సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గోదావరి జలాలతో అభిషేకం చేశారు. వేదిక కింద వేలాది మంది భక్తులు నదీ జలంతో పునీతులయ్యారు. తెల్లవారు జామున టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు పర్యవేక్షణలో అర్చక బృందం సభ్యులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
అలాగే సాయంత్రం మహదాశీర్వచనం, ఏకాంత సేవ, నీరాజనం మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మేళ తాళాలు, బ్యాండ్ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ వివిధ కళారూపాలు, నృత్య బృందాల ప్రదర్శనలు జరిగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పూజలు, కై ంకర్యాలలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


